House Hacking:


హైదరాబాద్‌లో (Hyderabad Real Estate News) ఇల్లు కొనాలని చాలామంది ఆశ! అదీ చిన్న వయసులోనే ఓ ఇంటిని సొంతం చేసుకుంటే ఉండే సంతృప్తే వేరు! ఈ కోరిక నెరవేరాలంటే కావాల్సింది డబ్బు. మన వద్ద లిక్విడ్‌ క్యాష్‌ లేదంటే బ్యాంకు రుణం తీసుకోక తప్పదు. కొన్నేళ్లపాటు ఎలాంటి చిక్కుల్లేకుండా సుదీర్ఘకాలం ఈఎంఐలు (EMIs) చెల్లించడం అంత తేలికేం కాదు! ఇవన్నీ మా వల్ల కాదులే అనుకుంటున్నారా? అయితే ఎక్కువ ఒత్తిడి లేకుండా యుక్త వయసులోనే ఇంటిని సొంతం చేసుకొనే ఐడియా చెబుతున్నారు నిపుణులు! అదే హౌజ్‌ హ్యాకింగ్‌ (House Hacking)!


ఏంటీ హౌజ్‌ హ్యాకింగ్‌?


రియల్‌ ఎస్టేట్‌ రంగంలో (Real Estate) ఉన్నవారికి హౌజ్‌ హ్యాకింగ్‌ పదం సుపరిచితమే! అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో ప్రాచుర్యం పొందిన హౌజ్ హ్యాకింగ్‌ గురించి ఇక్కడ చాలామంది తెలియదు. సొంత డబ్బు లేదా బ్యాంకు రుణంతో ఒక ప్రైమ్‌ లొకాలిటీలో ఇల్లు కొని కొంత భాగాన్ని ఇతరులకు అద్దెకు ఇవ్వడమే హౌజ్‌ హ్యాకింగ్‌. ఐటీ కారిడార్లు, ఉద్యోగం చేసే చోటకు దగ్గర్లో ఇంటిని తీసుకుంటే ఈ కాన్సెప్ట్‌ బాగా వర్క్‌ అవుతుంది. కిరాయి రూపంలో వచ్చే డబ్బుతో ఈఎంఐలు చెల్లించొచ్చు. లేదా కొంత భారం తగ్గించుకోవచ్చు.


హౌజ్‌ హ్యాకింగ్‌తో ప్రయోజనాలు


హౌజ్‌ హ్యాకింగ్‌ ద్వారా అద్దె రూపంలో ఆదాయం పొందడమే కాకుండా ఇతర ఖర్చులూ తగ్గించుకోవచ్చు. మీ ఆఫీసులో పనిచేసే సహోద్యోగులకే రెంట్‌కు ఇస్తే ఇంధన ఖర్చులు, ప్రయాణ భారం తగ్గించుకోవచ్చు. అలాగే ట్రాఫిక్‌ జామ్‌ల్లో టైమ్‌ వేస్ట్‌ అవ్వదు. విద్యుత్‌, నీరు ఇతర రుసుములను పంచుకోవచ్చు.
ఈ పద్ధతి ద్వారా మీకు ఇంటి యజమాని అన్న ఫీలింగ్‌, అనుభవం వస్తుంది. సంపాదిస్తున్న రెంటల్‌ ఇన్‌కంతో రియల్‌ ఎస్టేట్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చు. ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఉదాహరణకు మీ టెనంట్‌ నైట్‌ షిఫ్ట్‌లో ఉంటే మీరు డే షిఫ్ట్‌లో ఉండొచ్చు. ఇంటిని చూసుకోవచ్చు.


హౌజ్‌ హ్యాకింగ్‌తో ఇబ్బందులు


ఒకే ఇంటిలో టెనంట్‌తో పాటు ఉండటం కష్టం కావొచ్చు. అది మీ సొంత ఇంటిలా అనిపించకపోవచ్చు. మల్టీ యూనిటి్‌ స్పేస్‌ అన్న ఫీలింగ్‌ వస్తుంటుంది. డూప్లెక్స్‌ వంటివి అయితే బెస్ట్‌. ఒకవేళ టెనంట్‌ ప్రవర్తన బాగా లేకపోయినా, ఇంటి అద్దె చెల్లించకపోయినా మీకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఒత్తిడి కలగొచ్చు. అద్దెకు ఎవరు రాకపోయినా, ఇల్లు ఖాళీగా ఉన్నా మీపై ఖర్చుల భారం మరింత పెరగొచ్చు.


హౌజ్‌ హ్యాక్‌ జాగ్రత్తలు


* హౌజ్‌ హ్యాకింగ్‌లో మీకు ఇబ్బందులు రావొద్దంటే మల్టీ యూనిట్‌ ప్రాపర్టీ తీసుకోవడం బెస్ట్‌. ఉదాహరణకు డూప్లెక్స్‌ లేదా ట్రిప్లెక్స్‌. వీటివల్ల ఎక్కువ అద్దె వస్తుంది. ఇండిపెండెంట్‌ స్పేస్‌ దొరుకుతుంది.
* ఒకవేళ పెట్టుబడికి మీ వద్ద ఎక్కువ బడ్జెట్‌ లేకుంటే అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌లు ఉండేలా 2-3 బెడ్‌రూమ్‌లు ఉండే ఇంటిని తీసుకోండి.
* ఇంటిని మరింత విస్తరించుకొనేలా బేస్‌మెంట్‌, ఓపెన్‌ ప్లేస్‌ ఎక్కువ ఉన్న ప్రాప్టరీనే కొనుగోలు చేయండి.
* ఇల్లు చిన్నగా ఉన్నా ఎక్కువ ఓపెన్‌ ప్లేస్‌ ఉండేలా చూసుకోండి. అవసరమైతే అదనపు బెడ్‌రూమ్‌లు నిర్మించుకోవచ్చు. కామన్‌ ఏరియా విషయంలోనూ జాగ్రత్త వహించండి.