Kishan Reddy : హైదరాబాద్ లో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట, తుకారంగేట్, తార్నాక, లాలాపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి కాలనీల వాసులను అడిగితెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం కిషన్ రెడ్డి బోరబండ, ఎర్రగడ్డలలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.






రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు 


సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా సికింద్రాబాద్  అడ్డగుట్ట డివిజన్ లో పలు బస్తీలలో అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రెండు పడక గదుల ఇల్లు ఇంకా రాలేదని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన  విషయాన్ని పరిష్కరించాలని తనతో పాటు వచ్చిన అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అధికారులతో కలిసి ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకున్న అనంతరం వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే ఆదాయంలో 10 శాతం అయినా నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. సికింద్రాబాద్‌లోని పలు బస్తీలలో పర్యటించిన ఆయన.. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 


10 శాతం ఆదాయం ఇక్కడే ఖర్చు చేయాలి


"నాకు ఎప్పుడు సమయం దొరికినా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలను ప్రజలు తెలియజేశారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలను అధికారులకు అందిస్తు్న్నాను. జీహెచ్ఎంసీ, సీఎస్ కు ఈ సమస్యలను తెలియజేస్తాను. తెలంగాణకు మొత్తం రెవెన్యూలో 80 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీలో పనులు పెండింగ్ పడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ధర్నాలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిది ఒక్కటే ఒక 10 శాతం ఆదాయాన్ని అయినా స్థానికంగా ఖర్చుపెట్టాలని కోరుతున్నాను. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను." - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి