Covid Outbreak:
చైనాలో ఉద్ధృతం
కొన్ని నెలలుగా బ్రేక్ ఇచ్చిందనుకుంటున్న కరోనా...మరోసారి ఉద్ధృతమవుతోంది. పలు దేశాల్లో మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. కొవిడ్‌కు పుట్టినిల్లైనచైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ దేశం ఇప్పటికే కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారిపోయింది. చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మాస్ టెస్టింగ్ నిర్వహించడంతో పాటు ప్రయాణ ఆంక్షల్నీ విధించింది ఆ దేశం. జీరో కొవిడ్ పాలసీతో తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని గతంలోనే ప్రకటించింది చైనా. కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని నమ్ముతోంది. అందుకే..ఈ సారి కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాకపోతే...ఈ రూల్స్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, స్నాప్ లాక్‌డౌన్లు, మాస్ టెస్టింగ్, ట్రావెల్ పరిమితులు, ఇలా ఏం చేసినా సరే కరోనా వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోతుంది.
జీరో కొవిడ్‌తోనూ లాభం లేదు..
140 కోట్ల చైనా జనాభాతో పోలిస్తే ఈ కేసులు తక్కువైనప్పటికీ, జీరో కొవిడ్ పాలసీ అమల్లో ఉన్నా ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీరో కోవిడ్ విధానం ప్రకారం, చిన్న స్థాయిలో కరోనా వ్యాప్తి కనిపించినా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్ చేస్తారు. కరోనా సోకిన రోగులను నగరానికి దూరంగా ఉంచుతారు.చైనాలో 6 నెలల తర్వాత ఇటీవలే మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది. చైనాలో చాలా నగరాల్లో
కొవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరణాలు మాత్రం నమోదు కావడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇటీవల బీజింగ్‌కు చెందిన ఓ 87 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దీంతో చైనాలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా 5,227 మంది మృతి చెందినట్లయింది.
బ్రెజిల్, జపాన్‌లోనూ..
చైనాతో పాటు బ్రెజిల్‌లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 15 రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎయిర్ పోర్ట్స్‌లో, విమానాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. అలగోస్, బహియా, సియెర్రా, ఫెడరల్ డిస్ట్రిక్ట్, గోయాస్ తదితర ప్రాంతాల్లో కొవిడ్ బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. అటు జపాన్‌లోనూ ఇవే పరిస్థితులున్నాయి. శనివారం ఒక్కరోజే ఈ దేశంలో 1,25,327 కొత్త కేసులు నమోదయ్యాయి. రాజధాని టోక్యోలో కొత్తగా 13,569 కేసులు నమోదయ్యాయి. సివియర్ సింప్టమ్స్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 164 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితులు సమీక్షిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.