Sanju Samson Dropped:


న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ను (Sanju Samson) తొలగించడం మరోసారి విమర్శలకు దారితీసింది. బాగా ఆడుతున్నా అతడిని పక్కన పెట్టడంతో అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీ, జట్టు యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే అతడిని పక్కన పెట్టారేమోనని ఛలోక్తులు విసురుతున్నారు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్‌ ఎందుకు ముద్దయ్యాడని నేరుగా ప్రశ్నిస్తున్నారు.




మూడేళ్లుగా టీమ్‌ఇండియా ఎంపికపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సెలక్షన్‌ కమిటీ, జట్టు యాజమాన్యం తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. బాగా రాణిస్తున్నా కొందరు ఆటగాళ్లను పదేపదే పక్కన పెట్టడం లేదంటే రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడం వివాదాలకు కారణం అవుతోంది. ఎప్పుడో 16 ఏళ్లకే సంజూ శాంసన్‌ టీమ్‌ఇండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. నిలకడ లేదంటూ ఆ తర్వాత అతడికి అవకాశాలే ఇవ్వలేదు. మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. కన్‌సిస్టెంట్‌ పెర్ఫార్మర్‌గా మారాడు. జట్టు కూర్పు కుదరడం లేదంటే అతడికి మొండి చేయి చూపిస్తూనే ఉన్నారు.




ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. కొందరు అభిమానులైతే తిరువనంత పురంలో జరిగే మ్యాచులో తమ నిరసన ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు సంజూను భారత్‌-ఏ కెప్టెన్‌గా ఓ సిరీస్‌ ఆడించారు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీసులకు ఎంపిక చేశారు. మళ్లీ బంగ్లా పర్యటనకు దూరం పెట్టారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసులో అతడికి అవకాశమే ఇవ్వలేదు. ఇక తొలి వన్డేలో ఛాన్స్‌ ఇవ్వక బంతికో పరుగు చొప్పున సంజూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇప్పుడు కూర్పు కుదరడం లేదని రెండో వన్డేలో పక్కన పెట్టారు. దాంతో అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.




నిజానికి ఈ ఏడాది వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున ఎక్కువ సిక్సర్లు కొట్టింది సంజూ శాంసనే. 14 బాదాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (9) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. పది ఇన్నింగ్సుల తర్వాత అత్యధిక సగటు 66 సంజూ సొంతం. గణాంకాలు బాగున్నా, అద్భుతంగా ఆడుతున్నా అతడినే పక్కన పెట్టడం గమనార్హం.




'బాగా ఆడుతున్నా సంజూను పక్కన పెట్టారు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు లేకపోవడం ఇందుకు కారణం' అని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ అన్నాడు. 'ఎక్కువ సిక్సర్లు కొడుతున్నందుకే సంజూను తొలగించారు' అని మరో ఫ్యాన్‌ ట్వీట్‌ చేశాడు. 'సంజూను మళ్లీ బెంచీపై కూర్చోబెట్టారు. రిషభ్ పంత్‌ లాగే అతడికీ 10-15 మ్యాచులిచ్చి ఫలితం చూడాలి' అని మరొకరు అన్నారు.