Uber Rapido Driver Income Per Month: 'మీరు నెలకు ఎంత సంపాదిస్తారు?' అన్న ప్రశ్నకు, బెంగళూరుకు చెందిన ఓ బైక్ రైడర్ ఇచ్చిన సమాధానం విన్నాక జనం దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఆ ప్రశ్న-సమాధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ వీడియోను పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Paytm CEO Vijay Shekhar Sharma) షేర్ చేశారు. ఇందులో, ఓ రైడర్, ఉబర్  (Uber) & ర్యాపిడో (Rapido) కంపెనీల కోసం బైక్ నడుపుతూ నెలకు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో వెల్లడించాడు. తాను నెలకు 80,000 రూపాయల నుంచి 85,000 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు అతను చెప్పాడు. బైక్‌ రైడర్‌ చెప్పిన విషయం విని, ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి షాక్‌ అయ్యాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌ అయింది, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. గిగ్ ఎకానమీలో సాధ్యమవుతున్న ఉపాధి అవకాశాలకు సంబంధించి కొత్త చర్చను ప్రారంభించింది. 






రోజుకు 13 గంటలు రోడ్డు మీదే... 
తాను ప్రతిరోజూ 13 గంటలు డ్యూటీ చేస్తూ నెలకు 80,000 నుంచి 85,000 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఈ వీడియోలో ఉన్న బైక్‌ రైడర్‌ చెబుతున్నాడు. ఈ వీడియోపై సోషల్‌ మీడియా యూజర్లు రకరకాల కామెంట్‌లు చేశారు. ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత జీతం రావడం లేదని పోస్ట్‌లు పెడుతున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సర్వీస్‌ ఇండస్ట్రీని కూడా నెటిజన్లు ప్రశంసించారు, దానిని ఐటీ రంగంతో పోల్చారు. మరికొందరు, నెగెటివ్‌ కామెంట్లు కూడా పెట్టారు. ఆ బైక్‌ రైడర్‌ చెప్పేది నిజం కాదని కామెంట్లు పెట్టారు.


ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణ
రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, మన దేశంలో, బైక్ రైడింగ్ సర్వీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను ఉబర్‌, ర్యాపిడో వంటి కంపెనీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. దీని ద్వారా బైక్‌ రైడర్లు కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. బెంగుళూరు వంటి పెద్ద నగరాల్లో బైక్‌ సర్వీస్‌లకు చాలా గిరాకీ ఉంది. క్యాబ్‌లో వెళ్లడం కంటే బైక్‌ మీద వెళ్లడం వల్ల డబ్బు ఆదా అవుతుంది, సరైన సమయానికి గమ్యస్థానానికి చేరొచ్చు. ఒక్క బెంగళూరులోనే కాదు, దేశంలోని అన్ని నగరాల్లో ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు బైక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌కు ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా, ఆ బైక్‌ రైడర్లకు అవకాశాలు పెరగడం మొదలైంది. 


మరో ఆసక్తికర కథనం: మీ పిల్లల చదువు ఖర్చులను LIC చూసుకుంటుంది - స్కాలర్‌షిప్‌ కోసం ఈరోజే అప్లై చేయండి