Woman Beggar News Viral : యాచకులు(Beggars) మనకు కొత్తకాదు. గుడి(Temple), బడి(School), హోటల్(Hotel), సినిమా హాల్ ఎక్కడ చూసినా కనిపిస్తారు. అయ్యో పాపం అని జాలి పడేవారు, అదే సమయంలో చీదరించుకునేవారు కూడా ఉన్నారు. అయితే.. ఎవరు చీదరించుకున్నా.. ఎవరు అసహ్యించుకున్నా.. యాచకులు వారిమానాన వారు తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ యాచక వృత్తి కూడా.. కనక వర్షం కురిపిస్తోంది. ఇదేదో ఏడాదికో ఆరు మాసాలకో కాదు.. కేవలం రోజుల వ్యవధిలోనే అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి రుజువు అయింది. ఓ మహిళ కేవలం పది రోజుల్లోనే 75 వేలు సంపాదించి అధికారులను షాక్‌కి గురి చేసింది.
ఇలా వెలుగులోకి!
మధ్యప్రదేశ్(Madhyapradesh) రాజధాని ఇండోర్(Indore).. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా(Swatcha city) తొలిస్థానంలో ఉంది. దీనిని ఇలానే కొనసాగించాలన్న చర్యల్లో భాగంగా.. నగరంలో యాచకులు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రంగంలోకి దిగి ఇండోర్‌లోని యాచకులను గుర్తిం చి.. వారిని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా 14 బృందాలు యాచకులను గుర్తించే పని చేపట్టాయి. మహిళా యాచకులను కూడా సేవాధామ్ (Sevadham)కు పంపిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా వారి వద్ద నగదు ఇతరత్రా వస్తువుల అంశం చర్చకు వచ్చింది. వీరిలో ఒక మహిళ వద్ద ఏకంగా 75 వేల రూపాయలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని ఆమె కేవలం 10 నుంచి 12 రోజుల్లో యాచక వృత్తి ద్వారా సంపాయించినట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
Also Read: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ఇండోర్ వ్యాప్తంగా..
ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్(Ashish singh) ఆదేశాల మేరకు ఇండోర్(Indore) నగరాన్ని యాచక రహితంగా మార్చేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళా శిశు అభివృద్ధి అధికారి దినేష్ మిశ్రా(Dinesh misra) ఆధ్వర్యంలో సుమారు 14 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి దేవాలయాలు, మత స్థలాల చుట్టూ భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకుని ఉజ్జయిని సేవాధామ్ ఆశ్రమానికి పంపుతున్నారు. కలెక్టర్ ఆశిష్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 8 గంటల నుంచి మహిళా శిశు అభివృద్ధి బృందం చర్యలు ప్రారంభించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న మహిళలతో పాటు కొందరు వృద్ధులను కూడా పట్టుకుని వారందరినీ సేవా కేంద్రాలకు తరలించారు.
శనైశ్చర ఆలయం వద్ద.. !
మహిళా, శిశు సంక్షేమ శాఖ బృందం రాజ్‌వాడ(Rajwada) సమీపంలోని శనైశ్చర ఆలయం(Sani temple) వద్ద భిక్షాటన చేస్తున్న మహిళను గుర్తించింది. ఆమెను అదుపులోకి తీసుకుని సేవాధామ్‌కు తరలించే క్రమంలో ఆమె చీరలో దాచిన రూ.75 వేలకుపైగా నగదు ఉన్నట్టు గుర్తించారు. ఆమె 10 నుంచి 12 రోజుల్లో భిక్షాటన చేసి ఇంత మొత్తం సంపాయించుకున్నట్టు ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ మిశ్రా తెలిపారు. ఆమె ఇండోర్‌లోని పాల్డా ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు గుర్తించామని చెప్పారు. శనైశ్చర ఆలయం వద్ద ఆమె కొన్నాళ్లుగా యాచన చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ శని దోషం తొలిగేందుకు.. ఇలా భారీ మొత్తంలో యాచకులకు డబ్బులు ఇస్తూ ఉంటారని అందుకే.. ఆమె పది రోజుల్లోనే ఇంత సంపాయించి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యాచకులందరినీ ఉజ్జయినిలోని సేవా ధామ్ ఆశ్రమానికి పంపించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. గౌరవ ప్రదమైన వృత్తులు చేసుకునేలా వారిని ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
Also Read : రోజంతా అడుక్కుంటే ఎంత ఆదాయం వస్తుంది ? ఈ వ్యక్తి ప్రయోగం మీరే చూడండి - వీడియో