Retail Inflation In November 2024: దేశవ్యాప్తంగా ధరలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి, సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తున్నాయి. ధరల సరళిని సూచించే వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. దీనికి ముందు నెల అక్టోబర్‌లో ఇది 6.21 శాతంగా ఉంది, రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించిన లక్ష్యిత స్థాయి కంటే ఇది ఎక్కువ. వాస్తవానికి, అక్టోబర్‌లో నమోదైన 6.21 శాతం రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ది 14 నెలల గరిష్ట స్థాయి. వివిధ రంగాలలో కొనసాగుతున్న ధరల ఒత్తిడిని ఇది ప్రతిబింబించింది. ఆ స్థాయి నుంచి ఒక్క నెలలోనే దాదాపు ముప్పావు శాతం మేర తగ్గడం ధరల పట్టు తగ్గుతోందన్న సంకేతాలను ఇస్తోంది.
కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు (MoSPI) మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్' (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం... పట్టణ ప్రాంతాల్లో 4.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా 5.95 శాతంగా నమోదైంది. అంటే, దేశంలోని పట్టణాలు, నగరాలతో పోలిస్తే పల్లెల్లోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్, రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను 4 శాతం మధ్యకాలిక లక్ష్యంతో, 2-6 శాతం లక్ష్యిత పరిధిలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చాలా నెలలుగా, దేశంలో ఆహార పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధిలోకి రాకుండా దోబూచులాడుతోంది. నవంబర్‌లోనూ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ, మందగించే సంకేతాలను పంపింది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (CFPI) అక్టోబర్‌లోని 10.87 శాతం నుంచి నవంబర్‌లో 9.04 శాతానికి తగ్గింది. గత నెలలో.. కూరగాయలు, పప్పులు, చక్కెర & స్వీట్లు, పండ్లు, గుడ్లు, పాలు, సుగంధ ద్రవ్యాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదైందని NSO తెలిపింది. సరిగ్గా ఏడాది క్రితం, 2023 నవంబర్‌లో కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 8.70 శాతంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో CFPI ద్రవ్యోల్బణం 9.1 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గి 8.74 శాతంగా నమోదైంది.
హౌసింగ్ ఇన్‌ఫ్లేషన్ నవంబర్‌లో 2.87 శాతానికి పెరిగింది, అక్టోబర్‌లో 2.81 శాతంగా ఉంది. హౌసింగ్ ఇండెక్స్‌ను పట్టణ ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా లెక్కిస్తారు.
భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2022 ఏప్రిల్‌లో 7.79 శాతం వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. RBI ద్రవ్య విధాన కమిటీ (MPC), వడ్డీ రేట్లను పెంచిన తర్వాత & నిత్యావసరాల సరఫరాలను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అక్కడి నుంచి తగ్గింది. అయినప్పటికీ, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలు తక్కువ-ఆదాయ కుటుంబాల కొనుగోలు శక్తిని (purchasing power of lower-income households) తగ్గించాయి. ఇది, ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో అమ్మకాలను గణనీయంగా ప్రభావితం చేసింది.
అదే సమయంలో, భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి (Index of Industrial Production - IIP) అక్టోబర్‌లో 3.5 శాతానికి పెరిగింది, ఇది సెప్టెంబర్‌లో 3.1 శాతంగా ఉంది. ప్రధానంగా, తయారీ & విద్యుత్ రంగాలు పుంజుకోవడంతో IIP మెరుగుపడింది.
వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
నవంబర్‌లో CPI ఇన్‌ఫ్లేషన్ 5.50%గా నమోదవుతుందని మార్కెట్ అంచనా వేసింది, వాస్తవ నంబర్ (5.48%) దాని కంటే మెరుగ్గా ఉంది. చలికాలం ప్రారంభమైంది కాబట్టి ఆహార ధరల ద్రవ్యోల్బణంలో పతనం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.2-5.3%కు తగ్గవచ్చని లెక్కగట్టారు. ద్రవ్యోల్బణం మున్ముందు తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి కాబట్టి, దేశ వృద్ధికి తోడ్పడేందుకు, వడ్డీ రేట్లను సడలించడానికి RBIకి అవకాశం చిక్కుతుంది. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి, 2025 ఫిబ్రవరిలో RBI MPC సమావేశం అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: వీటిలో ఏది మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుంది?, మీకు ఈ విషయాలు కచ్చితంగా తెలియాలి