Differences Between EPF and EPS: ఒక వ్యక్తికి, ఏదైనా ఉద్యోగం చేస్తున్నంతకాలం, కుటుంబాన్ని పోషించుకోవడానికి స్థిరమైన ఆదాయం వస్తుంది. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, అతనికి ఆదాయం ఎలా వస్తుంది, శరీరంలో బలం తగ్గిపోయిన తర్వాత అతనికి ఉద్యోగం ఎవరు ఇస్తారు? - ఈ ప్రశ్నలకు సమాధానమే EPFO (Employees' Provident Fund Organization). రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు, భారత ప్రభుత్వం రెండు ప్రధాన పదవీ విరమణ పథకాలను అమలు చేస్తోంది. అవి.. ఉద్యోగుల భవిష్య నిధి (Employees' Provident Fund - EPF), ఉద్యోగుల పింఛను పథకం (Employee Pension Scheme - EPS).

రెండు పథకాలు, ఉద్యోగులకు వారి రిటైర్మెంట్‌ తర్వాతి జీవితంలో డబ్బు కొరత లేకుండా చూస్తాయి. అయినప్పటికీ, ఈ రెండు పథకాల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటి గురించి ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అంటే ఏంటి?
ఈపీఎఫ్‌ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం. ఉద్యోగుల కోసం రిటైర్మెంట్‌ కార్పస్‌ (పదవీ విరమణ చేసేనాటికి పెద్ద మొత్తంలో డబ్బు) సేకరించడానికి దీనిని రూపొందించారు. ఈ పథకం కింద, ఉద్యోగి & అతని కంపెనీ యాజమాన్యం ఇద్దరూ కొంత నిర్ధిష్ట మొత్తాన్ని నెలనెలా జమ చేస్తారు. కాలక్రమేణా పెద్ద మొత్తంలో ఫండ్‌ సృష్టిస్తారు. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగులు ఈ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జీవిత ప్రయాణం కొనసాగించవచ్చు.

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) అంటే ఏంటి?
ఇది EPFలో ఒక భాగం. రిటైర్మెంట్‌ తర్వాత, ఆ ఉద్యోగికి నెలవారీ పెన్షన్ అందించడం దీని ఉద్దేశం. పొదుపును ప్రోత్సహించేందుకు EPF ఉంటే; అర్హత కలిగిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత కూడా నెలవారీ ఆదాయం అందేలా హామీ ఇచ్చేందుకు EPF ఉంది.

EPF - EPS మధ్య కీలక భేదాలు

  EPF EPS
కాంట్రిబ్యూషన్‌ ఉద్యోగులు జీతం + డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో 12 శాతం, కంపెనీ యాజమాన్యం 3.67 శాతం జమ చేస్తారు. ఉద్యోగులు కాంట్రిబ్యూట్‌ చేయరు. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగి EPF జీతం + DA లో 8.33 శాతం జమ చేస్తుంది.
కంట్రిబ్యూషన్ పరిమితి నిర్ధిష్ట పరిమితి లేదు; జీతం + DA శాతం ఆధారంగా నిర్ణయమవుతుంది. నెలవారీ కాంట్రిబ్యూషన్‌ రూ. 1,250కి పరిమితం.
అర్హత EPF కింద కవర్ అయిన ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటుంది. జీతం + డీఏగా రూ.15,000 వరకు సంపాదించే ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నగదు ఉపసంహరణ ఐదేళ్ల సర్వీసుకు ముందు విత్‌డ్రా చేయాలంటే ఆదాయ పన్ను చెల్లించాలి. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు లేదా 58 ఏళ్ల వయస్సు వచ్చిన ఉద్యోగులకు ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
ప్రయోజనం రకం పదవీ విరమణ లేదా 60 రోజుల నిరుద్యోగం తర్వాత ఏకమొత్తంగా చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి, లేదా ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీలకు రెగ్యులర్ పెన్షన్ వస్తుంది.
వడ్డీ  ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వడ్డీ వస్తుంది, ప్రస్తుతం  8.15 శాతం వార్షిక వడ్డీ. కాంట్రిబ్యూషన్‌పై వడ్డీ ఉండదు.
ఆదాయ పన్ను పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పూర్తిగా పన్ను మినహాయింపు.  పెన్షన్ చెల్లింపులు, ఒకేసారి విత్‌డ్రా చేసిన మొత్తాలు పన్ను పరిధిలోకి వస్తాయి.

EPF & EPS ఎలా కలిసి పని చేస్తాయి?
ఉద్యోగికి సమగ్రమైన ఆర్థిక భద్రతను అందించడానికి EPF & EPS ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తాయి. EPF, ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్‌ సృష్టిస్తుంది. EPS, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ ఆదాయం అందిస్తుంది. ఈ రెండు పథకాలు కలిసి ఉద్యోగులకు బలమైన ఆర్థిక భద్రత వలయాన్ని సృష్టిస్తాయి, వృద్ధాప్యంలో వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడతాయి.

ఈ రెండు పథకాల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల ఉద్యోగులు తమ రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రయోజనాలను పెంచుకోవడానికి వీలవుతుంది.

మరో ఆసక్తికర కథనం: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌