ATM Access To Withdraw PF Amount: మీ ఆర్థిక అవసరాల్లో, పీఎఫ్‌ డబ్బుల కోసం ఇక ఎక్కడికీ తిరగక్కర్లేదు. నేరుగా ఏటీఎం కేంద్రానికి వెళ్లి పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో కొంత మొత్తాన్ని చక్కగా విత్‌డ్రా చేసుకోవచ్చు. నిమిషంలో పని పూర్తవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫెసిలిటీ లాంచ్‌ కావచ్చు. అంటే, ఒక్క నెల ఆగితే పీఎఫ్‌ చందాదార్లకు అద్భుతమైన ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది.


పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎం యాక్సెస్‌
వచ్చే ఏడాది (2025) నుంచి, EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్‌ను (PF) ATM ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం (11 డిసెంబర్‌ 2024) ప్రకటించారు. దేశంలోని విస్తృతమైన శ్రామికశక్తికి "మెరుగైన సేవలు" అందించడానికి మంత్రిత్వ శాఖ IT వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందని ఆమె వెల్లడించారు.


"పీఎఫ్‌ క్లెయిమ్‌లను మేము వేగంగా పరిష్కరిస్తున్నాం, కార్మికుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నాం. కనీస మానవ ప్రయత్నం ద్వారా, ఒక క్లెయిమ్‌దారు లేదా లబ్ధిదారు లేదా బీమా కవర్‌ ఉన్న వ్యక్తి తమ క్లెయిమ్‌ను ఏటీఎమ్‌ నుంచి సౌకర్యవంతంగా పొందొచ్చు. సాంకేతిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి రెండు మూడు నెలలకు, మీరు గణనీయమైన మార్పును చూస్తారు. 2025 జనవరి నాటికి పెద్ద పురోగతి ఉంటుందని నేను నమ్ముతున్నాను"
 - కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా


ఏటీఎం నుంచి పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకునే ఫీచర్ 2025 మే - జూన్ సమయంలో అందుబాటులోకి రావచ్చని, గతంలో, నేషనల్‌ మీడియాలో రిపోర్ట్‌లు వచ్చాయి. ఇప్పుడు, కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి చెప్పిన ప్రకారం, అది ఇంకా చాలా ముందుగానే లాంచ్‌ కానుంది.


కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని కీలక సంస్కరణలు


ఉద్యోగుల విరాళాలపై పరిమితి లేదు: ఉద్యోగుల విరాళాలపై 12 శాతం పరిమితిని తొలగించడం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో కీలక మార్పు. తద్వారా, ఉద్యోగులు తమ శక్తి కొద్దీ కాంట్రిబ్యూట్‌ చేయడానికి వీలవుతుంది. ఫలితంగా, వారి పదవీ విరమణ సమయానికి భారీ స్థాయిలో సంపద పోగవుతుంది. అయితే, కంపెనీ యాజమాన్యంపై మాత్రం అదనపు ఆర్థిక భారం ఉండదు.


పెన్షన్ మార్పిడి ఆప్షన్‌: ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించే ప్లాన్‌లో ఉంది. ఉద్యోగి అంగీకారంతో ఇది జరుగుతుంది. తద్వారా, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం కొత్త మార్గం తెరుచుకుంటుంది.


EPF స్కీమ్ కోసం జీతం పరిమితి పెంపు: ఈపీఎఫ్ స్కీమ్ అర్హత కోసం వేతన పరిమితిని పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వేతన పరిమితిని ₹6,500 నుంచి ₹15,000కు మార్చాలని చూస్తోంది. ఇది అమలైతే, 2024 సెప్టెంబర్ తర్వాత ఇది మొదటి సవరణ అవుతుంది.


కార్మికుల జీవితాల్లో మరింత సౌలభ్యం కోసం EPFO (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌) ​​సేవలను మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ప్రస్తుతం 70 మిలియన్లకు పైగా యాక్టివ్ కాంట్రిబ్యూటర్లు ఉన్నారు.


మరో ఆసక్తికర కథనం: చెరిగిపోని చరిత్ర సృష్టించిన ఎలాన్‌ మస్క్‌ - ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డ్‌