Elon Musk Makes History With 400 Billion Dollar Net Worth: టెస్లా చీఫ్ & ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎలాన్‌ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో, 400 బిలియన్ డాలర్ల ఆస్తి (Elon Musk Net Worth) కలిగిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg billionaires index) తాజా డేటా ప్రకారం, ఎలాన్‌ మస్క్ సంపద 400 బిలియన్‌ డాలర్లను దాటి, 447 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా 400 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరలేదు, ఇప్పుడు ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు ఎలాన్‌ మస్క్‌. తన దగ్గర ఉన్న డబ్బు కుప్పలపై, ఎలాన్‌ మస్క్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఎక్కి కూర్చున్నారు. 


నంబర్‌ 1 - నంబర్‌ 2 మధ్య భారీ అగాథం
విశేషం ఏంటంటే, ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడైన అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌కు (Jeff Bezos) - ఎలాన్‌ మస్క్‌కు మధ్య అత్యంత భారీ అంతరం ఉంది. జెఫ్‌ బెజోస్‌ కంటే ఎలాన్ మస్క్ నికర విలువ దాదాపు 200 బిలియన్ డాలర్లు ఎక్కువ. 


స్పేస్‌ ఎక్స్‌ షేర్ల విక్రయంతో $50 బిలియన్ల సంపద
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలాన్‌ మస్క్ నికర విలువ కేవలం ఒక్క రోజులోనే 62.8 బిలియన్ డాలర్లు పెరిగింది, 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి 447 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్పేస్‌ ఎక్స్‌ (SpaceX) షేర్ల విక్రయం కారణంగా టెస్లా చీఫ్ నికర విలువ అకస్మాత్తుగా అతి పెద్ద హై జంప్ చేసింది. షేర్ల విక్రయం తర్వాత, ఎలాన్‌ మస్క్ సంపద విలువ 50 బిలియన్ డాలర్లు పెరిగింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే (2024) అతని సంపద 218 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది.


ఎలాన్ మస్క్‌కు బూస్టర్ డోస్ ఇచ్చిన ట్రంప్ విజయం 
2022 సంవత్సరం ఎలాన్‌ మస్క్‌కు ఒక పీడకలలాంటిది. ఆ ఏడాదిలో, ఒకానొక సమయంలో, మస్క్‌ మొత్తం సంపద 200 బిలియన్‌ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విజయం సాధించినప్పటి నుంచి ఎలాన్‌‌ మస్క్‌ నికర విలువ పెరుగుతూ వస్తోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఇప్పటి వరకు టెస్లా షేర్లు 65 శాతం పెరిగాయి. టెస్లా ప్రత్యర్థి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను క్రెడిట్లను ట్రంప్ ప్రభుత్వం తొలగిస్తుందని మార్కెట్‌ భావిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కూడా ప్రమోట్ చేయనున్నారు. దీని కారణంగా టెస్లా షేర్లు స్పేస్‌ ఎక్స్‌ రాకెట్లలా దూసుకుపోతున్నాయి. ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్ పరిపాలనలో అత్యంత కీలక స్థానం లభించింది. ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ను తన ప్రభుత్వ సమర్థత విభాగానికి కో-హెడ్‌గా నియమించారు. ఈ విభాగం, వృథా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. 


మస్త్‌ ఖుషీలో మస్క్‌ కంపెనీలు
ఎలాన్‌ మస్క్‌కు చెందిన, సూపర్‌ కంప్యూటర్లు తయారే చేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ ఎక్స్‌ఏఐ (xAI) ఈ ఏడాది మే నెల నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో, ఆ స్టార్టప్‌ విలువ రెండింతలు పెరిగి 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. బుధవారం, స్పేస్‌ఎక్స్‌ - కంపెనీ పెట్టుబడిదారుల మధ్య కుదిరిన షేర్ల కొనుగోలు ఒప్పందం కారణంగా, ఈ కంపెనీ విలువ 350 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫలితంగా, ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ స్టార్టప్‌గా స్పేస్‌ఎక్స్‌ రికార్డ్‌ నెలకొల్పింది. 


మరో ఆసక్తికర కథనం: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?