‘మొరగని కుక్కా లేదు.. విమర్శించని నోరూ లేదు.. ఇవి రెండూ జరగని ఊరూ లేదు. కానీ మన పని మనం చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా’ అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమా టైమ్‌లో చెప్పిన డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది ఈ డైలాగ్‌ని వాడారు. అసలీ డైలాగ్ రజనీకాంత్ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ అనే బిరుదు. టాలీవుడ్‌లో చిరంజీవికి ఉన్న మెగాస్టార్ బిరుదును ఈ మధ్య కొందరు ఫ్యాన్స్ కావాలని వాళ్ల హీరోల పేర్లకు ముందు ఈ ట్యాగ్‌ని తగిలించినప్పుడు మెగా ఫ్యాన్స్‌కి ఎలా అయితే మండుతుందో... అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడూ పడితే అప్పుడు పోవడానికి..’ అని అనుష్క చెప్పిన డైలాగ్‌తో.. మా హీరో సూపర్ స్టార్ అని చెప్పుకున్న వారికి రజనీ ఫ్యాన్స్ ఇచ్చిపడేశారు. రజనీ ఫ్యాన్స్ సంగతి అటుంచితే.. ఏ హీరో ఫ్యాన్స్ అయితే తనని సూపర్ స్టార్ అని సంభోదించారో.. ఆ హీరోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక్కరే సూపర్ స్టార్? అది రజనీకాంత్ మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టారు. రజనీకాంత్‌కి సూపర్ స్టార్, చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదులు మాములుగా రాలేదు. ఆ బిరుదు వెనుక ఎంతో కష్టం ఉంది. ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. పనిపట్ల నిబద్ధత, కష్టపడేతత్వం వారికి ఆ స్థానాన్ని ఇచ్చాయి. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. నేడు (డిసెంబర్ 12) సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సొంతం చేసుకున్న రజనీకాంత్.. ఎప్పుడూ కూడా భూమి మీద నిలబడే మనిషి.






Also Readదటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్


ఆయనకు ఎటువంటి ఆడంబరాలు ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటారు. అప్పుడప్పుడు హిమాలయాకు వెళ్లొస్తుంటారు. ధ్యానం చేస్తుంటారు. తన ఎదురుగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే.. వారికి తెలియకుండానే ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి రజనీకాంత్. ఇలాంటి వారు బహు అరుదు. వయసుతో సంబంధం లేకుండా.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్న రజనీకాంత్.. తనని ఇంతటి వాడిని చేసిన వారి కోసం ఎంతటి కష్టమైనా పడతానని చెబుతుంటారు. తనని ఎవరెమన్నా పట్టించుకోరు. వారి పాపాన వారే పోతారులే అని ప్రశాంతతను కోరుకునే ఈ ‘నరసింహ’.. హద్దులు దాటితే మాత్రం ‘ఒకరేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే’ అనేలా ఉగ్రవతారం ప్రదర్శిస్తారు. అలా చెప్పిందే.. పైన చెప్పిన ‘మొరగని కుక్క.. నోరు, ఊరు’ డైలాగ్. అది ఎవరికి తగలాలో, ఎవరిని తాకాలో వారిని తాకింది. సాధారణ కండక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ఎంతో విలువైనది. అందరికీ ఎంతో ఆదర్శవంతమైనది. అలాంటి ఆదర్శవంతమైన జీవితం సాగిస్తూ.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోన్న సూపర్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే.


Also Readఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?