Mohan Babu News | మంచు మోహన్‌బాబు.. 500 సినిమాలకు పైగా నటించి.. 50 సినిమాల వరకూ నిర్మించి.. ఇంట్లో ముగ్గురు బిడ్డలను నటులుగా ఇండస్ట్రీకి అందించి.. టాలీవుడ్‌ మెయిన్ పిల్లర్లలో ఒకడిగా నిలిచిన వాడు. నటన విషయంలో మోహన్ బాబు టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అనొచ్చు. హీరోయిజమైనా, విలనిజమైనా, పౌరుషమైనా... పౌరాణికమైనా.. చివరకు కామెడీ అయినా సరే.. మోహన్‌బాబుకు తిరుగులేదు. అద్భుతమైన పాత్రలతో అలరించడమే కాదు.. అంతకంటే మంచి చిత్రాలను ప్రొడ్యూసర్‌గానూ అందించారు. 75ఏళ్ల పై వయసులో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ పెద్దదిక్కుగా ఉన్నారు. ఇదంతా మోహన్‌బాబుకు ఓ సైడు... 


ఇంకో వైపు చూస్తే.. ఆయన ప్రొఫెషనల్.. పర్సనల్‌ లైఫ్ లో బోలెడు వివాదాలున్నాయి. ఇప్పుడు ఇంట్లో గొడవ రచ్చకెక్కింది కానీ.. అంతకు ముందు నుంచే ఆయన చుట్టూ బోలెడు గొడవలున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏం జరిగిందో తెలీదు కానీ తిరుపతి రంగంపేట దగ్గర శ్రీ విద్యానికేతన్ పెట్టిన దగ్గర నుంచీ చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి.




శంకర్‌రెడ్డిపై దాడి..
తిరుపతి రంగంపేట దగ్గర పాతికేళ్ల కిందటే మోహన్‌బాబు విద్యాసంస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడది వందల ఎకరాల్లో యూనివర్సిటీగా రూపుదిద్దుకుంది. ఆ విద్యాసంస్థ దారి విషయంలో 1999లో ఊరి వాళ్లతో గొడవైంది. దానిని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధిపై దాడి చేసి కెమెరా ధ్వంసం చేశారు. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో అప్పటి తిరుపతి టీడీపీ నేత, మాజీ మునిసిపల్ ఛైర్మన్ కందాటి శంకర్‌రెడ్డిపై మోహన్‌బాబు అనుచరులు దాడి చేశారు. అప్పట్లో నటుడు శ్రీహరి కూడా ఆ గొడవలో ఉన్నారు. శ్రీహరితో స్నేహం ఉన్న మోహన్ బాబు ఆయన్ను తీసుకెళ్లారు. రివాల్వర్‌తో శంకర్‌రెడ్డిని బెదిరించారని ప్రచారం జరిగింది. 


నటులతో రచ్చ
మోహన్‌బాబుకు కోపం ఎక్కువ అన్న విషయం ఆయన కూడా చాలా సందర్భాల్లో అంగీకరించారు. తనది ధర్మాగ్రహం అని.. అన్యాయం జరుగుతుంటే సహించలేనని ప్రశ్నిస్తానని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ కోపం కాస్త తీవ్రమై తన సినిమాల్లో నటులపై దురుసుగా ప్రవర్తించడం, చేయు చేసుకోవడం జరిగేదని ప్రచారం జరిగింది. పెదరాయుడు సినిమా  షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటి జయంతిపై కోప్పడటమే కాకుండా చేయు చేసుకున్నారని బాగా ప్రచారం జరిగింది. అది పెద్ద గొడవగా మారడంతో అప్పట్లో దాసరి నారాయణరావు ఆ తగువును తీర్చారని చెబుతారు. ఆ తర్వాత విష్ణు బాబుతో తీసిన మొదటి సినిమా విష్ణు లో హీరోయిన్ శిల్పా శివానంద్ విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించారు. ఆమెపై కూడా చేయి చేసుకున్నారా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఆమెతో అయితే గట్టిగానే గొడవ అయిన విషయం మాత్రం నిజం. 




లెజండరీ వివాదం 
మోహన్‌బాబు గొడవలన్నింటిలోకి పెద్దది, ముఖ్యమైంది.. తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో జరిగిందే.  చిరంజీవిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన రగడ.. అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పట్లో సినిమా పెద్దలు చిరంజీవికి లెజండరీ అవార్డు ఇద్దాం అని ప్రతిపాదించారు. దీనిని మోహన్‌బాబు అంత పెద్ద వేదికపైనే ‘ఎవరు లెజండరీ.. ఎవరు సెలబ్రిటీ’ అని ప్రశ్నించారు. రాజ్యసభకు ఎంపికై.. పద్మశ్రీ తీసుకున్న తనకు అర్హత లేదా అన్నారు. ఆ వెంటనే చిరంజీవి సోదరుడు పవన్ కల్యాన్.. మోహన్‌బాబు ను ఉద్దేశించి.. “తమ్ముడూ మోహన్‌బాబు” అన్నారు ఈ గొడవ ముదరడంతో చిరంజీవి తనకు ఆ అవార్డు వద్దని వారించి.. కుదిరితే తెలుగు సినిమా వందేళ్ల ఫంక్షన్లో తీసుకుంటా అన్నారు. 


పొలిటికల్ వివాదాలు
మోహన్‌బాబు నటుడు మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్న ఆయన ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న మోహన్‌బాబు ఆయన్ను పదవీచ్యుతుడిని చేసే సమయంలో చంద్రబాబు వెంట ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చంద్రబాబుతో గొడవ అయింది. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నుంచీ చంద్రబాబును వ్యతిరేకిస్తూ వచ్చిన మోహన్‌బాబుకు.. చంద్రబాబుతో వ్యాపార గొడవలు కూడా వచ్చాయి. హెరిటేజ్‌ను ప్రారంభించినప్పుడు మోహన్‌బాబు కూడా అందులో ఓ డైరెక్టర్. అందులో వాటాల విషయంలో చంద్రబాబుతో విబేధించారు. ఆ తర్వాత వైఎస్సార్‌కు, ఆయన కుమారుడు జగన్‌కు సన్నిహితంగా ఉన్న మోహన్‌బాబు 2014-19లో చంద్రబాబు పై గట్టిగానే మాట్లాడారు. వేలాది మంది విద్యార్థులను రోడ్లపైకి తెచ్చి.. ఫీజు రీయెంబర్స్మెంట్ చేయడం లేదంటూ.. తిరుపతి రోడ్డుపైన పడుకున్నారు. ఆ తర్వాత.. తర్వాత చంద్రబాబుతో కొద్దిగా సర్దుబాటు అయింది. 




అనేక గొడవలు
మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా కాలం హెయిర్ డ్రస్సెర్ గా పనిచేసే నాగ శ్రీను అనే వ్యక్తితో గొడవ అయింది. ఆయనపై ఫ్యామిలీ దొంగతనం కేసు పెట్టగా.. ఆ వ్యక్తి తనను వేధించారని కులం పేరుతో దూషించారని ఆరోపణలు చేయడంతో పెద్ద గొడవే జరిగింది. ఇక ఆయన మాటల వల్ల జరిగిన రచ్చలు అనేకం. రంగంపేటలో మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉండే దుకాణాల విషయంలో చిన్న చిన్న గొడవలు చాలా జరిగాయి. ఈ దుకాణదారులను యూనివర్సిటీ వాళ్లు  ఇబ్బంది పెడుతున్నారని మనోజ్ వాళ్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అక్కడ నుంచే ఇంట్లో గొడవలు పెరుగుతూ వచ్చాయి. 




Also Read: Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట


ట్రోలింగ్ స్టార్లు
ఓ నటుడిగా తిరుగలేని స్టార్ అయిన మోహన్‌బాబు వ్యక్తిగా మాత్రం ట్రోలింగ్‌ స్టార్. ఆయన, ఆయన కుటుంబం చేసిన వ్యాఖ్యలు, చేష్టల వల్ల అనేక సార్లు వీళ్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని పనిగట్టుకుని చేశారని మంచు విష్ణు అనేక సార్లు చెప్పినా కానీ.. వీళ్లు సోషల్ మీడియాలో పలుచన అయిందైతే నిజం. మోహన్‌బాబు దురుసుతనంతో.. మంచువిష్ణు ఫన్నీ కామెంట్లతో.. మంచు లక్ష్మి తనదైన మేనరిజం, యాక్సెంట్‌తో ఫేమస్ అయ్యారు. వీళ్లంతా ఓ టైప్ అయితే మనోజ్ ఇంకో రకం. ఇంట్లో ఉన్న అందరిపైనా ట్రోలింగ్ రావడం వీళ్ల విషయంలోనే జరిగింది.