Personal Loan For New Business: ఒకరి దగ్గర పని చేయడానికి ఇష్టపడకుండా, సొంతంగా ఒక వ్యాపారం చేద్దామనే ఆలోచన ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా యువత మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. ఇలాంటి వాళ్లకు, వ్యాపారం ప్రారంభించడానికి, విస్తరించడానికి & జీవితంలో ఎదగడానికి స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఉండదనిదల్లా డబ్బు మాత్రమే. వ్యాపారానికి పెట్టుబడి/మూలధనం లేకపోవడంతో వాళ్ల వ్యాపార ప్రణాళిక పేపర్‌పైనే ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో, పర్సనల్ లోన్ ఆర్థికంగా తోడుగా నిలుస్తుంది, వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. వ్యాపార కల కాగితంపైనే ఆగిపోకుండా క్షేత్ర స్థాయిలోకి రావడానికి తోడ్పడుతుంది. అయితే, వ్యక్తిగత రుణం రివార్డ్‌లతో పాటు కొన్ని రిస్క్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ రుణం తీసుకునే ముందు బాగా ఆలోచించడం చాలా ముఖ్యం.


వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు
సాధారణంగా, వ్యక్తిగత రుణాన్ని అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటుంటారు. ఈ లోన్‌ ప్రత్యేకత ఏమిటంటే, డబ్బు వెంటనే అందుబాటులోకి వస్తుంది, ఏ ఆస్తినీ తనఖా పెట్టవలసిన అవసరం ఉండదు. అయితే, వడ్డీ రేటు (Interest Rate Of Personal Loan) సహా కొన్ని విషయాల గురించి రుణం తీసుకునే ముందే ఆలోచించడం ముఖ్యం. సాధారణంగా, పర్సనల్‌ లోన్‌పై వార్షిక వడ్డీ రేటు 9.99 శాతం నుంచి 44 శాతం వరకు ఉంటుంది. 


వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే, ఇది మంచి ఆప్షన్‌. బిజినెస్ లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ కోసం అప్రూవల్ పొందడం సులభం. పర్సనల్ క్రెడిట్ హిస్టరీ (Credit History) బాగుంటే, ఒక వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం లభిస్తుంది. ముఖ్యంగా, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వంటి తక్కువ పెట్టుబడి సరిపోయే వ్యాపారాలకు ఇది చక్కగా సూటవుతుంది. నిధులు లేక బిజినెస్‌ ఆగిపోయే ఇబ్బందిని దూరంగా ఉంచుంది.


పర్సనల్ లోన్ కోసం క్రెడిట్ స్కోర్ 
ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి తక్షణం లభించే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు ఉంటుంది. తిరిగి చెల్లించే వ్యవధి (Repayment period) తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ పొందాలంటే మంచి క్రెడిట్ స్కోర్ (Credit Score) తప్పనిసరి.


క్రెడిట్ స్కోర్‌ అనేది మూడు అంకెల సంఖ్య. ఇది, మీరు ఇప్పటివరకు తీసుకున్న హోమ్ లోన్‌, పర్సనల్ లోన్‌, బిజినెస్ లోన్‌ వంటివాటిని ఎలా తీర్చారో చూపిస్తుంది. ఒక్క EMI కూడా మిస్‌ కాకుండా సకాలంలో బకాయి చెల్లించిన వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటుంది. ఒక్క EMIని మిస్‌ చేసినా లేదా సకాలంలో చెల్లించకపోయినా క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కారణంగా, సాధారణంగా, జీతం పొందే వ్యక్తులకు పర్సనల్‌ లోన్‌ త్వరగా లభిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు క్రెడిట్ స్కోర్‌ ఉండదు కాబట్టి, వాళ్లు వ్యక్తిగత రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 


ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు
మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి అర్హులా లేదా అనేది కూడా మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. మీ గుర్తింపు కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయ రుజువు మొదలైనవి ఉంటే ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. లేదా, మీ దగ్గరలోని బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేయవచ్చు. 


వడ్డీ రేటు, తిరిగి చెల్లించాల్సిన కాలం, ఏ బ్యాంక్‌లో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాల గురించి రుణం తీసుకునే ముందే తెలుసుకోండి.


మరో ఆసక్తికర కథనం: రూ.100 కంటే తక్కువ ధరకే బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు - ఎయిల్‌టెల్‌, జియో యూజర్లకు బెనిఫిట్‌