Lookback 2024 BJP is continuing with the same momentum: 2024 ఏడాది రాజకీయ పార్టీలన్నింటికీ ఓ కీలక సంవత్సరం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సాయంతో బీజేపీని గట్టి దెబ్బకొట్టేందుకు ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చూపించినప్పటికీ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపలేపోయింది. తాము ముందుగు రాలేకపోయింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదాను గత పదేళ్లుగా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం అది సాధ్యమయింది. అదొక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరట. 


కొనసాగుతున్న బీజేపీ హవా 


2014 నుంచి బీజేపీకి అద్భుతమైన రోజులు గడుస్తున్నాయి. రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేశారు. కశ్శీర్ కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసి భారత్ లో పూర్తిగా కలిపేశారు. అయోధ్య సమస్యను పరిష్కరించి రాముడి గుడి కట్టేశారు. ఇలా రాజకీయంగా విజయాలతో పాటు తాము చేయాలనుకున్నవి చేస్తూ వచ్చారు. మూడో సారి ఎన్నికల్లో గెలవడానికి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఎన్నికల  ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. పూర్తి మెజార్టీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన టీడీపీ, జేడీయూలు మంచి ఫలితాలు సాధించడంతో ఎన్డీఏకు ఎదురులేకుండా పోయింది. ఈ రెండు పార్టీలు గతంలోలానే బీజేపీకి సహకరిస్తున్నాయి. అందుకే పూర్తి మెజార్టీ లేని బీజేపీ అన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాదు బీజేపీ ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. మహారాష్ట్ర, హర్యానాల్లో మళ్లీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ తో పాటు జార్ఖండ్‌లో మాత్రమే అధికారాన్ని పొందలేకపోయారు. ఎలా చూసినా జాతీయ  రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని స్థానం కొనసాగిస్తోంది. 


జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల వైభవం


చాలా కాలం తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యాయి. చంద్రబాబు, జేడీయూ చేతుల మీదుగా ప్రభుత్వం నడుస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మంచి ప్రయోజనాలు లభించాయని అంటున్నారు. రాజకీయంగానూ చంద్రబాబు, నితీష్ పేర్లు తరచూ ఢిల్లీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. 


కిందామీదా పడుతూ కాంగ్రెస్ పయనం


జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పయనం ఓ అడుగు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా వంద సీట్లు సాధించి ఇక తిరుగులేదు అని ఆ పార్టీ తన భుజం తాను తట్టుకుంటున్న సమయంలో గెలిచిపోవాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడింది. మహారాష్ట్రలో అదే పరిస్థితి. జార్ఖండ్, జమ్మూకశ్మర్‌లలో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ అక్కడ మైనర్ భాగస్వామి. బీజేపీతో హోరాహోరీగా తలపాడాల్సిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ బోర్లా పడుతోంది. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కావాలంటే కాంగ్రెస్ ను పక్కన పెట్టేసి ఇండియా కూటమికి మమతా బెనర్జీ నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాయి. ఆ దిశగా వచ్చే ఏడాది కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 


జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కష్టమే !


బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోవడంతో మొత్తం పరిస్థితి మారిపోతుందని అనుకున్నామని కానీ.. బీజేపీకి నాలుగు వందల సీట్లు వచ్చినట్లుగానే పాలన సాగుతోందని .. నియంతృత్వ స్థాయిలోనే మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ సందర్భంలో చెప్పారు. ఇది అక్షర సత్యం. ఎన్నికలు జరిగాయి. ఫలితాలువచ్చాయి. నెంబర్లుమారాయి కానీ బీజేపీ హవా, మోదీ హవాకు వచ్చిన ఢోకా ఏమీ ఈరకంగా చూస్తే ఈ ఏడాది కూడా బీజేపీదే  అని తేల్చేయవచ్చు.