LIC Golden Jubilee Scholarship Scheme 2024 Details: ప్రతి తల్లీదండ్రీ, తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని కచ్చితంగా కోరుకుంటారు. అయితే, మన దేశంలో విద్యా ద్రవ్యోల్బణం (Education Inflation) వల్ల, నాణ్యమైన విద్య పేదవారికి ఎప్పుడూ అందనంత దూరంలో ఉంటోంది. తమ పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చదివించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు రాజీ పడుతున్నారు. ఫలితంగా, తెలివితేటలు ఉన్న పిల్లలు కూడా మంచి చదువుకే కాదు ఉజ్వల భవిష్యత్తుకూ దూరం అవుతున్నారు. అలాంటి పిల్లలకు చేయూత అందించి, నాణ్యమైన విద్యను వారికి దగ్గర చేయడానికి మన దేశంలోని ప్రభుత్వ & ప్రైవేటు రంగంలోని చాలా సంస్థలు ఏటా ఉపకార వేతనాలు (Scholarships) ప్రదానం చేస్తున్నాయి. అలాంటి సంస్థల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒకటి.


ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకుని, ఏటా స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఈ ఏడాది, "గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 కార్యక్రమాన్ని" (LIC GJF Scholarship Scheme 2024) ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్... 2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో (లేదా సమానమైన CGPA గ్రేడ్‌తో) పదో తరగతి (10th) లేదా 12వ తరగతి (12th) లేదా డిప్లొమా (Diploma) లేదా సమాన స్థాయి విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరికీ వర్తిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు కూడా ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ కింది కోర్సులు చదవాలనుకుంటున్న బాలురు లేదా బాలికలు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 కోసం అప్లై చేసుకోవచ్చు.


(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు


(ii) ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో (ITI) వృత్తిపరమైన కోర్సు (Vocational Course)


ఈ కింది కోర్సులు చదవాలనుకుంటున్న బాలికలకు రెండేళ్ల పాటు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు:


(i) 9వ తరగతి & 12వ తరగతి లేదా 10+2 విధానంలో ఇంటర్మీడియట్ 


(ii) 10వ తరగతి తర్వాత ఏదైనా రంగంలో రెండేళ్ల పాటు డిప్లొమా కోర్సు.


రెండు విడతలుగా స్కాలర్‌షిప్‌ చెల్లింపు
ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన బాలికలకు 10వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రూ.1,500 అందజేస్తారు. వాళ్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు లేదా ఇన్‌స్టిట్యూట్‌లలో తదుపరి చదువులు పూర్తి చేసేందుకు ఈ డబ్బు సాయపడుతుంది. ఇందులో ఐటీఐ లేదా 12వ తరగతి చదువు కూడా ఉన్నాయి.


ఇతర స్కాలర్‌షిప్‌ల విషయానికి వస్తే.. ఆ మొత్తాన్ని కూడా రెండు విడతలుగా చెల్లిస్తారు. అంటే, ఏడాదికి రెండుసార్లు రూ.7,500 చొప్పున చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకు NEFT ద్వారా ఈ డబ్బును పంపుతారు. దీని కోసం, లబ్ధిదారుడు తన IFSC కోడ్‌తో పాటు బ్యాంక్ ఖాతా సమాచారాన్ని, క్యాన్సిల్‌ చేసిన చెక్కును దరఖాస్తుతో పాటు అందించాలి. డబ్బు బదిలీ జరగాల్సిన బ్యాంక్‌ ఖాతా యాక్టివ్‌గా ఉండాలని గుర్తుంచుకోండి.


ఉన్నత చదువులకు కూడా సాయం
ఎంపికైన అభ్యర్థులు MBBS, BAMS, BHMS, BDS వంటి మెడిసిన్‌ కోర్సులు చదువులు చదవాలనుకుంటే, వారికి చదువు సమయంలో రెండు విడతలుగా రూ.40,000 చెల్లిస్తారు. ఎల్‌ఐసీ అందించే ఈ స్కాలర్‌షిప్, డబ్బు లేక ఉన్నత విద్యను పొందలేని విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. 


ఎవరైనా BE, B.Tech, BArch వంటి ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేయాలనుకుంటే, వారికి వార్షిక స్కాలర్‌షిప్ రూ. 30,000 లభిస్తుంది. ఇది కూడా రెండు విడతలుగా అందుతుంది. అంటే ఏడాదికి రెండుసార్లు రూ.15,000 చొప్పున ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.


ఆన్‌లైన్ దరఖాస్తు, అర్హతలు, షరతులు సహా ఈ పథకం పూర్తి వివరాలను https://licindia.in లింక్‌ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 22.12.2024.


మరో ఆసక్తికర కథనం: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి