Mukesh Ambani Family Organises Mass Wedding | ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం (Anant Ambani Wedding) జులై 12న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు అనంత్, రాధికల వివాహ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుమారుడి వివాహానికి ముందే కొందరు పేద జంటలకు సామూహిక వివాహాలు జరపాలని అంబానీ దంపతులు నిర్ణయించడం తెలిసిందే.
పేదలకు అంబానీ ఫ్యామిలీ సామూహిక వివాహాలు
నవీ ముంబైలో మంగళవారం నాడు (జులై 2న) పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు అంబానీ దంపతులు. కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించి పెద్ద మనసు చాటుకున్నారు. ఆ జంటల్ని ప్రత్యేకంగా పలకరించి వారికి అభినందనలు తెలిపారు. ఆ పెళ్లి జంటలకు బంగారం, వెండి ఆభరణాలను గిఫ్ట్ ఇచ్చారు.
అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు, తమ కుటుంబసభ్యులతో కలిసి సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. అనంతరం కొత్త జంటలకు నీతా అంబానీ చేతుల మీదుగా కానుకలు అందించారు. కొత్త జంటలు సంతోషంగా ఉండాలని వారిని అంబానీ ఫ్యామిలీ దీవించింది. సామూహిక వివాహాలతో నవీ ముంబైలో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది.
పిల్లల పెళ్లిలో తల్లి ఆనందం ఇలా ఉంటుంది..
సామూహిక వివాహ వేడుకల అనంతరం నీతా అంబానీ మాట్లాడుతూ ‘ఇంత మందికి సామూహిక వివాహాలు జరిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల పెళ్లి చేస్తే ఓ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందో, ఈరోజు నేను అంతే సంతోషంగా ఉన్నాను. కొత్త జంటలను మా కుటుంబం మంచి మనసుతో ఆశీర్వదించింది. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. దేవుడు వారిని చల్లగా చూడాలని ప్రార్థించా. మా చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించామని’ చెప్పారు.
ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 12 నుంచి 3 రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ కార్యక్రమాలు జరుగుతాయని అంబానీ కుటుంబం తెలిపింది. ఇదివరకే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ఇతర రంగాల ప్రముఖులకు అంబానీ ఫ్యామిలీ ఆహ్వానాలు పంపింది. రెడ్, గోల్డ్ కలర్స్‌తో అనంత్ అంబానీ, రాధికల శుభలేఖని డిజైన్ చేశారు. అంబానీ ఫ్యామిలీ పెళ్లి వేడుకల గురించి కార్డులో పేర్కొన్నారు. జులై 12న శుభ వివాహ్ కార్యక్రమం, జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరుగుతుంది. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజైన జులై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్ వేడుక జరిపిస్తారు.
Also Read: అనంత్ అంబానీ వెడ్డింగ్‌కి హాజరయ్యే అతిథులకు డ్రెస్‌కోడ్, ఒక్కో రోజు ఒక్కో గెటప్‌లో గెస్ట్‌లు