CM Revanth Key Comments On Movie Industry In Command Control Center Event: తెలుగు సినీ పరిశ్రమలో ఉండే ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) కీలక సూచన చేశారు. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని చెప్పారు. ఇది కచ్చితమైన షరతు అని పేర్కొన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Center) టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమ సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని.. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
'టికెట్ రేట్లు పెంచుకోవాలంటే..'
కొత్త సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచాలంటూ ఎవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే.. వారు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు ఓ వీడియో చేయాలని సినీ ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ సూచించారు. చిత్ర పరిశ్రమలో ఎంత పెద్దవాళ్లు వచ్చి రిక్వెస్ట్ చేసినా.. ఆ మూవీ తారాగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియోను తీసుకొచ్చి ఇవ్వాలన్నారు. అలా చేస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారని.. తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలని అన్నారు. అది వాళ్ల బాధ్యతని చెప్పారు. 'సినిమా కోసం రూ.వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్ రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అయితే అది వ్యాపారం. దాంతో పాటే సామాజిక బాధ్యత కూడా అవసరం. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వం నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. మా తరఫున ఇదొక్కటే కండీషన్. సినిమా షూటింగ్స్ కోసం అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతున్నా.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
'వారికి పదోన్నతులు'
సమాజంలో మార్పు, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని.. సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారని.. నేరాల కట్టడికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. సైబర్ క్రైమ్స్ నియంత్రణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని.. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇస్తున్నారని అభినందించారు. 'రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం. సైబర్ నేరాలు, డ్రగ్స్ అరికట్టడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పదోన్నతులు కల్పిస్తాం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దీనికి సంబంధించి విధి విధానాలు సిద్ధం చేస్తాం.' అని సీఎం వెల్లడించారు.