Adani Vizhinjam Port News: అదానీ గ్రూప్‌లో ATM లాంటి కంపెనీ 'అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్' (Adani Ports and Special Economic Zone Ltd- APSEZ). దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా నిలపాలన్న లక్ష్యంతో పని చేస్తున్న గౌతమ్ అదానీ, ముంద్రా పోర్ట్ తర్వాత, దేశంలోని మరో ప్రధాన ఓడరేవు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో నిర్మిస్తున్న ఆ ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్ట్ సిద్ధమైతే, వ్యూహాత్మకంగా అదానీ పోర్టులన్నింటికీ కీలక స్థానంలో నిలుస్తుంది.
భారీ మొత్తంలో పెట్టుబడులు
కేరళలోని విజింజంలో, కొత్త ఓడరేవును (Vizhinjam Transhipment Terminal) అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. దీని కోసం అదానీ గ్రూప్ 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేసి, ఇక్కడి నుంచి కార్గోని నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దశలవారీగా, 2030 నాటికి 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పూర్తి చేయాలని గౌతమ్ అదానీ కంకణం కట్టుకున్నారు. తొలి దశలో ఈ ప్రాజెక్టులోకి రూ.7,700 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చెబుతోంది. ఇందులో, అదానీ కంపెనీ నుంచి రూ. 2,500 - 3000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన డబ్బు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ ( viability gap fund) ద్వారా వస్తోంది.
వచ్చే ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు
గత వారం, ఈ టెర్మినల్‌లోకి అధికారికంగా మొదటి నౌక వచ్చింది. జెన్ హువా 15 అనే ఈ నౌకకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన క్రేన్లను ఈ నౌక తీసుకొచ్చింది. ఈ ఓడరేవులో, వచ్చే ఏడాది మే-డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.
విజింజం ఓడరేవుకు చాలా ప్రత్యేకతలు
విజింజం ఓడరేవు 18 మీటర్లకు పైగా సహజ లోతుతో ఉన్న దేశంలోని ఏకైక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్చు. దీనివల్ల భారీ నౌకలు ఇక్కడకు రావచ్చు. అంతర్జాతీయ షిప్పింగ్ రూట్‌కు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. అనేక దేశీ & అంతర్జాతీయ ఓడరేవుల కంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల, ఓడలు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే వేగంగా డాక్‌ను చేరుకోవచ్చు.
వ్యూహాత్మకంగా చూస్తే, అదానీ గ్రూప్‌తో పాటు దేశానికి కూడా కూడా ఈ పోర్ట్ చాలా కీలకం. చైనా సంస్థల మద్దతుతో నడుస్తున్న శ్రీలంకలోని కొలంబో పోర్టు మీద ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.
అదానీ పోర్టులన్నింటికీ విజింజం ప్రాజెక్టు ఒక హబ్‌లా పని చేస్తుంది. మిగిలిన అన్ని పోర్టుల నుంచి ఇక్కడికి/ఇక్కడి నుంచి మిగిలిన పోర్టులకు కార్గో రవాణా పెరుగుతుంది. APSEZ నిర్వహిస్తున్న 13 పోర్టులు లేదా టెర్మినల్స్‌కు ప్రస్తుతం సంవత్సరానికి 580 మిలియన్ టన్నుల (mt) కార్గోను నిర్వహించగల సామర్థ్యం ఉంది. FY23లో వీటి ద్వారా 339.2 mt కార్గోను నిర్వహించారు.
2030 నాటికి, APSEZ ప్రపంచంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా నిలవాలని, 1 బిలియన్ టన్నుల కార్గోను నిర్వహించాలన్న గౌతమ్ అదానీ లక్ష్యం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: వడ్డీ రేట్లు మార్చిన యాక్సిస్ బ్యాంక్, ఐదేళ్ల కాలానికి ఎక్కువ ఇంట్రస్ట్ ఆఫర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial