ప్రపంచకప్‌లో టీమిండియాపై ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్‌పై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. కనీసం పోటీ కూడా ఇవ్వకుండానే దాయాది జట్టు చేతులెత్తేయడంపై  పాక్‌ మాజీలు మండిపడుతున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదనున్న వారికి నిరాశను మిగులుస్తూ పాక్‌ను టీమిండియా ఏకపక్షంగా చిత్తు చేసింది. అయితే భారత్‌తో మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీస్తానని మ్యాచ్‌కు ముందు పాక్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రీదీ ప్రతినబూనిన విషయాన్ని ఇప్పుడు టీమిండియా అభిమానులు గుర్తు చేస్తున్నారు. పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి రోహిత్‌ సేన ఛేదించందని.. పాక్‌ బౌలర్లు అందరూ కలిపి కూడా మూడు వికెట్లు తీయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి.... షహీన్‌ షా అఫ్రీదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


భారత్‌పై పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రీదీ... ఆరు ఓవర్లలో 36 పరుగులిచ్చి శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్‌ల వికెట్లు తీశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోహిత్‌ విధ్వంసంతో భారత్‌ విజయం ముంగిట నిలిచింది. షహీన్‌ షా అఫ్రీదీ మంచి బౌలర్‌ అని... కాకపోతే అతను వసీం అక్రమ్‌ కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. షహీన్‌... వసీం అక్రమ్‌ కాదని.. అతనో మంచి బౌలర్‌ అని.. అతనికి అంత హైప్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అతడిని మంచి ఆటగాడిగా గుర్తిస్తే చాలని... కానీ గొప్ప ఆటగాడు మాత్రం కాదని దానిని అందరూ అంగీకరించాలని  టీమిండియా మాజీ కోచ్‌ కామెంట్‌ చేశాడు. 


ఇక ఈ ప్రపంచకప్‌లో షహీన్‌ షా అఫ్రీదీ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ పాక్‌ పేసర్‌ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సులభంగా ఎదుర్కొంటున్నారు. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే నిరూపితమైంది. షహీన్‌ తేలిగ్గా ఎదుర్కొన్న రోహిత్‌ విధ్వంసం సృష్టించాడు. ఇక భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు షహీన్‌ తాను అయిదు వికెట్లు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కొత్త బంతితో షాహీన్‌ షా అఫ్రీదీని ఎదుర్కోవడంలో భారత్‌ కాస్త ఇబ్బంది పడినట్లు గత రికార్డులు చెబుతున్నాయి. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకలేదు. షహీన్‌ను భారత బ్యాటర్లు సునాయసంగా ఎదుర్కొన్నారు. ఇప్పటివరకూ 46 వన్డేలు ఆడిన షాహీన్‌ షా అఫ్రీదీ కేవలం రెండుసార్లు మాత్రమే 5 వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్‌లో షాహీన్ అఫ్రిది టీమ్ ఇండియాతో రెండు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో షాహీన్ 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సూపర్-4 దశలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై షాహీన్ పూర్తిగా వెలవెలబోయాడు. 7.90 ఎకానమీతో 10 ఓవర్లలో 79 పరుగులు ఇచ్చాడు. భారత్‌పై ఇప్పటివరకూ మూడు వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్‌ స్పీడ్‌ స్టార్‌... 31.20 సగటుతో 5 వికెట్లు తీసుకున్నాడు.


 భారత్‌పై తమకున్న చెత్త రికార్డు బద్దలు కావడానికి సిద్ధంగా ఉందన్న పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ మాటలను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 1992లో వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019, 2023 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ప్రతి ఒక్కసారీ టీమిండియానే గెలిచింది. ఇప్పటివరకూ భారత్‌పై పాక్‌ విజయం నమోదు చేయలేదు. తాను గత రికార్డులను నమ్మనని, ఈసారి మాత్రం ఆ రికార్డులన్నీ బద్దలు కాబోతున్నాయని.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు బాబర్ వ్యాఖ్యానించాడు. కానీ ఈ వ్యాఖ్యలు కూడా నిజం కాకపోవడం... భారత్‌కు పాక్ కనీస పోటీ ఇవ్వకపోవడంపై పాక్ అభిమానులు భగ్గుమంటున్నారు.