Ratan Tata Achievements: భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా (86) ఆరోగ్య కారణాల రీత్యా మృతి చెందారు. భారతదేశానికి ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించారు. 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ గ్రూపునకు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. భారతీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. వాటిలో ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.


టాటా మోటార్స్ స్థాపన (Tata Motors)
టాటా సన్స్‌ సంస్థకు సంబంధించిన టాటా మోటార్స్... రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడే స్థాపితం అయింది. ఆ తర్వాత భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇది ఎంతో కీలక సంస్థ అయింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఈ సంస్థకు మంచి పేరు ఉంది. ప్రస్తుతం పాసింజర్ కార్ల విభాగంలో ఇది ప్రముఖ సంస్థల్లో ఒకటి.


టాటా ఇండికా తయారీ... (Tata Indica)
భారతదేశంలో పూర్తిగా తయారైన మొదటి కారు టాటా ఇండికా. దీన్ని కూడా టాటా మోటార్స్‌నే రూపొందించింది. దీని తయారీలో రతన్ టాటా ప్రమేయం ఎంతగానో ఉంది. ఈ కారు మొదటి సారి 1998లో లాంచ్ అయింది. పూర్తిగా భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కారు ఇది. మైలేజీ, అందుబాటులో ధర... ఇటువంటి వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు.


జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కలుపుకోవడం (Jaguar Land Rover)
రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ ప్రముఖ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. ఇది టాటా మోటార్స్ ఇతర దేశాల్లో కూడా విస్తరించేందుకు సహాయపడింది. అలాగే ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో కంపెనీ ఎంట్రీని సులభతరం చేసింది. 2.3 బిలియన్ డాలర్లతో (ప్రస్తుత భారతీయ కరెన్సీలో రూ.20 వేల కోట్లకు పైనే) టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను టేకోవర్ చేయడంతో ఫోర్డ్ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడింది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


టాటా నానో తయారీ (Tata Nano)
ఇప్పుడు కార్లు కామన్ అయిపోయాయి కానీ ఒకప్పుడు కారు అనేది లగ్జరీ. కానీ కారును అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టాటా మోటార్స్... నానో కారును రూపొందించింది. ద్విచక్రవాహనాల కంటే కాస్త ఎక్కువ ధరకే కారును అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో ఈ కారును రూపొందించారు. 2008 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును మొదట పరిచయం చేశారు. రూ.లక్ష ధరలో దీన్ని తీసుకురావాలనేది కంపెనీ లక్ష్యం. కానీ ఈ కారు మనదేశంలో ఆశించినంత సక్సెస్ కాలేదు.


ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రతన్ టాటా (Automotive Hall of Fame)
జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రతన్ టాటా కూడా చేరారు. రోజెర్స్ పెన్‌స్కే, లూకా డీ మోంటేజెమోలో వంటి ఆటోమోటివ్ దిగ్గజాల సరసన రతన్ టాటా చేరడం భారతీయులు గర్వించదగ్గ విషయం.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?