Ratan Tata News: మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్త & సంపన్నుడు రతన్ టాటా బుధవారం (09 అక్టోబర్ 2024) అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం.. ఆయన లోబీపీ కారణంగా హైపోటెన్షన్‌తో బాధపడ్డారు. దీనివల్ల శరీరంలోని చాలా భాగాలు పని చేయడం మానేశాయి. గొప్ప పోరాటయోధుడిగా వ్యాపార వర్గాల్లో పేరు తెచ్చుకున్న రతన్‌ టాటా, వ్యాధులతోనూ పోరాటం చేశారు. 86 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచారు.


దీనికిముందు కూడా, సోమవారం నాడు (అక్టోబర్ 07న), ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆరోగ్యం విషమించిందని, ICUలో చికిత్స చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై స్వయంగా రతన్‌ టాటా స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, పుకార్లు వ్యాప్తి చేయవద్దంటూ Xలో ట్వీట్‌ చేశారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లానని ఆ ట్వీట్‌లో రాశారు. స్వయంగా రతన్‌ టాటా చెప్పేసరికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అందరూ భావించారు. అంతలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.



రతన్ టాటా ఆస్తుల విలువ ఎంత?
రతన్‌ టాటా పరోపకారి. ఆయనది చాలా మంచి మనస్సు. ఇతరుల కష్టాలకు ఇట్టే కరిగిపోయే గుణం ఉంది. టాటా ట్రస్ట్‌ ద్వారా దేశంలోని ప్రజలకు ఆయన చాలా సాయం చేశారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధితో పాటు ప్రకృతి విపత్తుల నివారణ కోసం కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చారు. రతన్‌ టాటా, 1991లో టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టారు. 2012 వరకు చైర్మన్‌గా కొనసాగారు. ఆ సమయంలో టాటా గ్రూప్ వ్యాపారం ఇంటి వంటగది నుంది ఆకాశంలో విమానాల వరకు విస్తరించింది. టాటా గ్రూప్‌కు నాయకత్వం వహిస్తూనే, గ్రూప్‌ వ్యాపారాలను దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం వ్యాపింపజేశారు. టాటా గ్రూప్‌ వ్యాపారం విస్తరించేకొద్దీ రతన్‌ టాటా ఆదాయం కూడా పెరిగింది. ఒక రిపోర్ట్‌ ప్రకారం, 2022లో రతన్ టాటా మొత్తం సంపద విలువ (Ratan Tata Net Worth) రూ.3,800 కోట్లు. IIFL వెల్త్ హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో ఆయన 421వ స్థానంలో ఉన్నారు.


ఆదాయంలో ఎక్కువ భాగం విరాళాలు
టాటా గ్రూప్‌లో 100కు పైగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్‌ మొత్తం టర్నోవర్ సుమారు 300 బిలియన్‌ డాలర్లు. వ్యాపారాన్ని నిర్వహించినందుకు రతన్ టాటాకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని దాతృత్వం కోసం కేటాయించారు. ఎన్నో భూరి విరాళాలు ఇచ్చారు. 


రతన్‌ టాటాను స్మరించుకుంటూ, టాటా సన్స్ ఛైర్మన్ N చంద్రశేఖరన్ ‍‌(Chairman of Tata Sons N Chandrasekaran) చేసిన ప్రకటనలో, రతన్ టాటాను తన స్నేహితుడిగా & గురువుగా అభివర్ణించారు. "రతన్ నావల్ టాటాకు మేము తీవ్ర విచారంతో వీడ్కోలు పలికాం. ఆయన నిజంగా అసాధారణమైన నాయకుడు. అతని సాటిలేని నాయకత్వం టాటా గ్రూప్‌ను మాత్రమే కాదు, మన దేశాన్ని కూడా తీర్చిదిద్దింది" అని ఆ ప్రకటనలో చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: భూరి విరాళాలు ఇవ్వడంలో దాన కర్ణుడు -మూగజీవాల కష్టం చూసి కన్నీళ్లు పెట్టేసుకునే కోటీశ్వరుడు