Meta Verified Subscription Plans: ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఇవాళ్టి నుంచి వెరిఫైడ్ సబ్‌ స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ఎంపిక చేసిన యూజర్లలో సబ్‌ స్క్రిప్షన్ విధానాన్ని టెస్ట్ చేసిన మెటా, పరీక్షలు విజయవంతం కావడంతో మరిన్ని ఫీచర్లు, సపోర్టుతో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ లో వెరిఫైబ్ బిజినెస్ ఆఫర్లను తీసుకొస్తున్నట్లు తెలిపింది. వెరిఫైడ్ బ్యాడ్జ్, మెరుగైన అకౌంట్ సపోర్ట్, సెక్యూరిటీని అందించనున్నట్లు వివరించింది. ఈ మేరకు ప్లాన్ వివరాలను వెల్లడించింది.


నాలుగు రకాల సబ్‌స్క్రిప్షన్ ఫ్లాన్లు


తాజాగా తీసుకొచ్చిన వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లతో ఆయా సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్ షిప్ ఫ్యాకేజీని అందిస్తున్నట్లు మెటా సంస్థ వెల్లడించింది. టెస్ట్ రన్ లో భాగంగా ఒకే ఫ్లాన్ ను అందించిన మెటా సంస్థ.. ఇప్పుడు  నాలుగు రకాల ఫ్లాన్లను అందిస్తున్నట్లు తెలిపింది ఈ ఫ్లాన్లకు సంబంధించి ధర వివరాలను కూడా మెటా వెల్లడించింది. ప్రారంభ వెరిఫైడ్ సబ్‌ స్క్రిప్షన్ ప్లాన్ ధర  రూ. 639 కాగా,  అత్యధికంగా రూ.21000 వరకు ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. భారతీయ వినియోగదారులు ఈ సబ్‌ స్ర్కిప్షన్ ప్లాన్లను ఐఓఎస్, ఆండ్రాయిడ్ సోర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని మెటా యాజమాన్యం సూచించింది.


వెరిఫైడ్ బ్యాడ్జ్ లో లాభాలు ఏంటంటే?


ఇక ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ ద్వారా ఆయా సంస్థలు తమ వ్యాపారాలను మెరుగు పరుచుకోవచ్చని మెటా సంస్థ వెల్లడించింది. వెరిఫైడ్ అకౌంట్ అనేది వినియోగదారులలో నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపింది. కస్టమర్లు ఆయా సంస్థలతో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పింది. వెరిఫైడ్ టిక్ లేకపోవడం వల్ల నిజమైన అకౌంట్ ఏదో? ఫేక్ అకౌంట్ ఏదో? తెలియక వినియోగదారులు పొరపాటుపడే అవకాశం ఉంటుంది. వెరిఫైడ్ టిక్ తో అన్ని అనుమానాలకు చెక్ పడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా ప్లాన్ల సెలక్షన్ ను బట్టి మెటా వెరిఫైడ్ సబ్‌ స్క్రైబర్ల కోసం సపోర్ట్ అందించనున్నట్లు మెటా ప్రకటించింది.


తొలుత వెరిఫైడ్ సబ్‌ స్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన X


ఈ వెరిఫైడ్ సబ్‌ స్క్రిప్షన్ విధానాన్ని తొలుత X తీసుకొచ్చింది. ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత, పేరును Xగా మార్చారు. ఆ తర్వాత ఈ వెరిఫైడ్ సబ్‌ స్క్రిప్షన్ విధానాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మెటా యాజమాన్యం కూడా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. భారత్ లో ఫేస్‌బుక్, ఇన్‌ స్టాగ్రామ్‌లో మెటా వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్  బ్లూ టిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ కనిపిస్తుంది. వాట్సాప్ లో గ్రీన్ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌‌ ఉంది.



Read Also: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మోబైల్స్ ఇవే