Honda Goldwing Tour Motorcycle: హోండా చవకైన బైక్‌లను తయారు చేయడమే కాకుండా చాలా ఎక్కువ ధర కలిగిన బైక్‌లను కూడా విక్రయిస్తుంది. హోండా మనదేశంలో హోండా గోల్డ్ వింగ్ టూర్ (Honda Goldwing Tour) అనే బైక్‌ను సేల్ చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? దీని ధర టయోటా ఫార్చ్యూనర్ బేస్ మోడల్ కంటే ఎక్కువగా ఉండటం గుర్తుంచుకోవాల్సిన అంశం. అసలు ఈ బైక్ ధర ఎంత? దీని ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం


హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్‌ను గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 39.7 లక్షలుగా ఉంది. హోండా ఈ బైక్‌ను సీబీయూ ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేస్తుంది. ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి మీరు హోండా ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.


ఈ హోండా బైక్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? (Honda Goldwing Tour Features)
గోల్డ్ వింగ్ టూర్ బైక్ పూర్తి ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, 7 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంది. రైడింగ్, నావిగేషన్, ఆడియో సమాచారాన్ని అందిస్తుంది. 



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


అద్భుతమైన ఎయిర్ ప్రొటెక్షన్ కోసం, పొడిగించిన ఎలక్ట్రిక్ స్క్రీన్, రెండు యూఎస్‌బీ టైప్-సీ సాకెట్లతో బ్లూటూత్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్‌లు సహా అనేక ఇతర ఫీచర్లు కూడా ఈ బైక్‌లో అందించారు. ఈ హోండా బైక్ బరువు 390 కిలోలుగా ఉంది. బరువు చాలా ఎక్కువ అయినప్పటికీ నడపడం చాలా సులభమని కంపెనీ అంటోంది. దీనిలో మీరు ఏకంగా 21.1 లీటర్ల భారీ ఇంధన ట్యాంక్‌ని పొందుతారు. హోండా గోల్డ్ వింగ్ టూర్ సీటు ఎత్తు 745 మిల్లీమీటర్లుగా ఉంది.


హోండా గోల్డ్ వింగ్ టూర్ ఇంజిన్ సీసీ ఎంత?
గోల్డ్ వింగ్ టూర్‌లో 1833 సీసీ, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, 24 వాల్వ్, ఫ్లాట్ 6 సిలిండర్ ఇంజన్ అందించారు. ఈ ఇంజిన్ 124.7 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో పెయిర్ అయింది. ఇది సౌకర్యవంతమైన క్రీప్ ఫార్వర్డ్, బ్యాక్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది టూర్ థ్రోటల్ బై వైర్ (TBW) సిస్టమ్‌తో పాటు నాలుగు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. టూర్, స్పోర్ట్, ఎకానమీ, రెయిన్ మోడ్‌ల్లో దీన్ని రైడ్ చేయవచ్చు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?