Tension At Rayadurgam: రాయదుర్గం ఓరియన్ విల్లాస్ (Rayadurgam) వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజ్‌పాకాల సోదరుడు రాజేంద్రప్రసాద్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని వారిని అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు.. రాజేంద్రప్రసాద్ విల్లాలో తనిఖీలు చేపట్టారు. కాగా, జన్వాడ ఫాంహౌస్‌లో మద్యం పార్టీకి ఆతిథ్యం ఇచ్చారన్న కారణంతో రాయదుర్గంలోని రాజ్‌పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.


ఓరియన్ విల్లాలో రాజ్‌పాకాల ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే, విల్లాకు తాళం వేసి ఉండడంతో కాసేపు వేచి చూశారు. అనంతరం మరో విల్లాలో ఉన్నారన్న సమాచారం మేరకు అధికారులంతా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్కడికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.


ఇదీ జరిగింది


నగరంలోని జన్వాడ ఫాం హౌస్‌లో పార్టీ జరుగుతుందన్న సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఫాంహౌస్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడం హాట్ టాపిక్‌గా మారింది. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు 35 మందితో మద్యం పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకి డ్రగ్స్ టెస్ట్ చేయించగా అసలు వ్యవహారం బయటపడింది. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. దీంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద  మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫాంహౌస్‌లో క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కాయిన్స్ సైతం లభ్యమయ్యాయి. దీంతో క్యాసినో సైతం నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఫాంహౌస్ 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.


'7 లీటర్ల మద్యం సీజ్'


జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో విచారణ జరుగుతోందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. ఫాంహౌస్ సూపర్వైజర్ కార్తిక్ ఏ1గా, రాజ్‌పాకాలను ఏ2గా చేర్చామని చెప్పారు. 'నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకున్నారు. కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నాం. 7 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం. రాజ్‌పాకాాల పరారీలో ఉన్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.' అని పేర్కొన్నారు.


Also Read: Janwada Drugs Party: కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు