SUV Sales Report January 2024: 2024 జనవరిలో భారతదేశంలో 46,000 కంటే ఎక్కువ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. ఈ విభాగంలో అమ్మకాలు 2023 డిసెంబర్‌తో పోలిస్తే 12 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి. గత నెలలో మారుతి గ్రాండ్ విటారా దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. ఆ తర్వాత హ్యుందాయ్ క్రెటా రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో జరిగిన అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం.


మారుతి సుజుకి గ్రాండ్ విటారా అగ్రస్థానంలో
మారుతి గ్రాండ్ విటారా 2024 జనవరిలో 13,400 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ సైజ్ ఎస్‌యూవీగా నిలిచింది. గ్రాండ్ విటారా కూడా గరిష్టంగా 92 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. సెగ్మెంట్‌లో అత్యధిక మార్కెట్ వాటాను కూడా కలిగి ఉంది.


హ్యుందాయ్ క్రెటా
గ్రాండ్ విటారా తర్వాత, హ్యుందాయ్ క్రెటా 10,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటిన ఏకైక ఎస్‌యూవీ. గత నెలలో మొత్తం 13,212 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలవారీ అమ్మకాల్లో దాదాపు 43 శాతం వృద్ధిని నమోదు చేసింది.


కియా సెల్టోస్
గత నెలలో కియా సెల్టోస్ అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీని అమ్మకాలు మందగించాయి. కేవలం 6,400 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 2023 డిసెంబర్‌తో పోల్చితే 3,500 యూనిట్ల కంటే ఎక్కువ తగ్గడం గమనించాలి. 2024 జనవరి అమ్మకాలు గత ఆరు నెలల సగటు అమ్మకాల కంటే దాదాపు 4,500 యూనిట్లు తక్కువగా ఉన్నాయి.


టయోటా హైరైడర్
మారుతి గ్రాండ్ విటారా అదే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన టయోటా హైరైడర్ 5,543 యూనిట్లకు పైగా అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టయోటా ఎస్‌యూవీ 11 శాతం కంటే ఎక్కువ నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.


హోండా ఎలివేట్
4,500 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలతో 2024 జనవరిలో హోండా ఎలివేట్ 4.5 శాతానికి పైగా నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. ఎలివేట్ కారును 2023 సెప్టెంబర్‌లో హోండా లాంచ్ చేసింది. ప్రస్తుతం దీని మార్కెట్ వాటా 9.8 శాతంగా ఉంది.


స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్
2024 జనవరిలో స్కోడా కుషాక్ అమ్మకాలు 48 శాతం, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అమ్మకాలు 56 శాతం క్షీణించాయి. గత నెలలో టైగన్, కుషాక్ కలిపి 2,300 యూనిట్లు అమ్ముడయ్యాయి.


ఎంజీ ఆస్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్
అమ్మకాలు దాదాపు 18 శాతం పెరిగినప్పటికీ ఎంజీ ఆస్టర్ ఇప్పటికీ 1,000 యూనిట్ల విక్రయాల మార్కును చేరుకోవడంలో విఫలమైంది. అదే సమయంలో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ జనవరి 2024లో సెగ్మెంట్‌లో అత్యల్పంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 231 యూనిట్ల విక్రయాలు జరిగాయి.


మరోవైపు మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు రాబోయే వారాల్లో మార్కెట్లోకి రానుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను పరిచయం చేయడానికి ముందు ఇప్పటికే ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్‌ను "ర్యాంప్ డౌన్" చేయనున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ300 లైనప్‌ను డిమాండ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!