Pawan Uttarandhra Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఒకవైపు పొత్తుల వ్యవహారాన్ని తేల్చే దిశగా అడుగులు వేస్తున్న జనసేన అధినేత.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలు, క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలాన్ని తెలుసుకునే దిశగా చర్యలను ప్రారంభించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ఈ ప్రాంతంలో జనసేనకు బలం ఉంది. కానీ, బలమైన నాయకులు లేరని పవన్‌ ముందు నుంచి భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి జనసేనలోకి రావాలనుకునే వారికి పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొణతాల, పంచకర్ల, వంశీ వంటి నేతలు చేరారు. రానున్న రోజుల్లో మరింత మంది చేరే అవకాశముంది. అటువంటి వారిని చేర్చుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్‌ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలతో చర్చించేందుకు పవన్‌ విశాఖ పర్యటనకు ఆదివారం రాత్రి వచ్చారు. 


కీలక నేతలతో మంతనాలు


అర్ధరాత్రి 7.30 గంటలకు విశాఖ వచ్చిన పవన్‌ కల్యాణ్‌ అర్ధరాత్రి దాటినంత వరకు నేతలతో చర్చలు జరిపారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాజీ మంత్రి కొణతాల ఇంటికి వెళ్లిన పవన్‌.. అక్కడ సుమారు గంటపాటు చర్చలు అనంతరం నోవాటెల్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో పార్టీ కీలక నేతలతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తీసుకోబోయే సీట్లు, ఏయే నేతలకు అవకాశాలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉందన్న అంశాలపై తన మనసులోని మాటను, పొత్తులో భాగంగా లభించేందుకు అవకాశాలు ఉన్న సీట్ల గురించి పవన్‌ చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. టికెట్లు రాని నేతలు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పని చేయాల్సిందిగా పవన్‌ సూచించారు. అటువంటి నేతలకు భవిష్యత్‌లో అండగా ఉంటానని పవన్‌ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. 


నియోజకవర్గాల వారీగా సమీక్ష


సోమవారం నుంచి నియోజకవర్గాలు వారీగా పవన్‌ కల్యాణ్‌ సమీక్షించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో పవన్‌ కల్యాణ్‌ విడివిడిగా భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలకు సమాచారాన్ని అందిచంఆరు. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో పవన్‌తోపాటు జనసేన కీలక నేత నాగబాబు పంచకర్ల రమేష్‌బాబు, శివ శంకర్‌, కోన తాతారావు, సుందరపు విజయ్‌ కుమార్‌, వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, బొలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు, కందుల నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు.