JP Nadda continue as National President of BJP till June 2024: మోదీ-నడ్డా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. జేపీ నడ్డా (JP Nadda) హస్తవాసి బీజేపీ(BJP)కి బాగా కలిసొచ్చింది. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కమలం పార్టీ వెనక్కి తిరిగి చూసుకున్న దాఖలాలు లేవు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ వికసించింది. అందుకే ఈ కాంబినేషన్ కొనసాగించాలని భావించిన బీజేపీ(BJP) పార్లమెంటరీ పార్టీ లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు మళ్లీ జేపీ నడ్డానే బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలంటూ తీర్మానించింది. ఈమేరకు ఆయన పదవీకాలం పొడిగించింది. 


విజయ పరంపర
జగత్ ప్రకాశ్ నడ్డా అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ జేపీ నడ్డా(J.P.Nadda)... ఈ పేరు మాత్రం రాజకీయవర్గాల్లో బాగా గుర్తుండిపోయే పేరు. బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడిగా  వివిధ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు.  ఆయన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలదళానికి బాగా కలిసొచ్చిందన్న పేరు ఉంది. దీంతో మరోసారి ఆయన పదవీకాలాన్నీ పార్టీ పొడిగించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు అంటే ఈ ఏడాది జూన్ వరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా  కొనసాగనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.


నడ్డా పదవీకాలం పొడిగిస్తున్నట్లు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) సూత్రప్రాయంగా తెలిపారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛకూడా కల్పించారు. కాకపోతే ఆ నిర్ణయాన్ని ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది. 
నడ్డా ప్రస్థానం
బిహార్ లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) మూలాలున్న కుటుంబంలో జన్మించిన నడ్డా...విద్యాబ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేశారు. లా చదువుతున్న జేపీ నడ్డా తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి రెండోసారి గెలిచిన నడ్డా..మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2007లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత బీజీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన జేపీ నడ్డా...ఢిల్లీలో పార్టీ పెద్దలతో పరిచయాలు బాగా పెంచుకున్నారు. ప్రధాని మోడీ(Modi))కి బాగా దగ్గరైన నడ్డా ఆయన తొలి క్యాబినెట్ లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా(Amithsha) ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడంతో  కీలకమైన బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి జేపీ నడ్డాను వరించింది.


అప్పటి నుంచి పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయడంతోపాటు బీజేపీ(BJP) రెండోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టడానికి తనవంతుగా కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించడంలో ప్రధాన పాత్ర వహించారు. దీంతో ఆయన సారథ్యంలో మరోసారి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ అగ్రనేతలతోపాటు వేలమంది కార్యకర్తలు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా  400 స్థానాలు గెలిచి తీరాలని...అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయాలని బీజేపీ అగ్రనేతలు సూచించారు. గత ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన 161 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.