World's First CNG Bike Sales: బజాజ్ ఆటో 2024 జూలైలో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125ను లాంచ్ చేసింది. ఈ బజాజ్ బైక్‌పై ప్రజలు పిచ్చ క్రేజీగా ఉన్నారు. ఈ సీఎన్‌జీ బైక్ అక్టోబర్ నెలలో విపరీతంగా అమ్ముడైంది. ప్రభుత్వ వెబ్‌సైట్ వాహన్ డేటా ప్రకారం గత నెలలో ఫ్రీడమ్ 125కు సంబంధించి 10 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సీఎన్‌జీ మోటార్‌సైకిల్ విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటివరకు 20 వేలకు పైగా యూనిట్లను విక్రయించింది.


బీభత్సమైన సేల్స్
బజాజ్ ఫ్రీడమ్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 20,942 యూనిట్లు అమ్ముడు పోయాయి. ఫ్రీడమ్ 125 జూలైలో 272 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అప్పటి వరకు ఈ బైక్ దేశంలోని రెండు రాష్ట్రాలకు మాత్రమే చేరుకుంది. ఆగస్టు 15వ తేదీ తర్వాత బజాజ్ తన మొదటి సీఎన్‌జీ బైక్‌ను 77 నగరాలకు డెలివరీ చేసింది. దీంతో పాటు సీఎన్‌జీ ఫిల్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది. బజాజ్ భారతదేశంలో ఇప్పటివరకు 7,000 సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్లను ప్రారంభించింది. 2030 నాటికి ఈ స్టేషన్ల సంఖ్యను 17 వేలకు పైగా పెంచాలన్నది కంపెనీ లక్ష్యం.


దేశంలో ఎకో ఫ్రెండ్లీ బైక్‌లకు కాలంతో పాటు డిమాండ్ పెరుగుతోంది. తొలి రెండు, మూడు నెలల్లో కంపెనీ 10 వేల యూనిట్ల సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ లక్ష్యం 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 30 నుంచి 40 వేల యూనిట్ల ఉత్పత్తిని చేరుకోవడం.



Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!


బజాజ్ సీఎన్‌జీ బైక్ ఇంజన్ ఇలా...
బజాజ్ నుంచి వచ్చిన ఈ సీఎన్‌జీ బైక్ 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 9.5 పీఎస్ పవర్‌ని, 5,000 ఆర్పీఎం వద్ద 9.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ హ్యాండిల్‌బార్‌కు ఎడమ వైపున ఇచ్చిన స్విచ్‌తో వాహనాన్ని పెట్రోల్ మోడ్ నుంచి సీఎన్‌జీ మోడ్‌కి, సీఎన్‌జీ నుంచి పెట్రోల్ మోడ్‌కి సులభంగా మార్చవచ్చు.


ఫ్రీడమ్ 125 ధర ఎంత?
బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది సీఎన్‌జీ, పెట్రోల్ ఫ్యూయల్ ఇంజన్‌లతో నడిచే బైక్. ఈ బైక్‌కు సంబంధించిన మూడు వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రీడమ్ 125 ఎన్జీ04 డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.95,000గా ఉంది. ఇందులో ఎన్జీ04 డ్రమ్ ఎల్ఈడీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,05,000 కాగా, ఎన్‌జీ04 డిస్క్ ఎల్ఈడీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,10,000గా ఉంది.


ఈ బైక్ సూపర్ సక్సెస్ కావడంతో త్వరలో మరిన్ని సీఎన్‌జీ బైక్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.



Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!