Ganesh Chaturthi 2023 Shubh Muhurat:  గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంత శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు.  ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది. చవితి నుంచి చతుర్థశి వరకూ ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడిని ఆ తర్వాత వైభవంగా గంగమ్మ ఒడికి చేరుస్తారు.  ఈ ఏడాది గణపతి పూజ ఏ సమంలో చేసుకోవాలి...


సెప్టెంబరు 18 సోమవారం వినాయకచవితి - ఈ సమయంలో పూజ చేసుకోవాలి



  • ఈ‌ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషాలు వరకూ ఉంది. సూర్యోదయానికి తిథి ఉండడం ముఖ్యమే కానీ... చవితి పండుగ రోజు  వాడవాడలా వినాయకుడు కొలువుతీరి పూజలందుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది

  • సెప్టెంబరు 18 సోమవారం అయితే ఉదయం పదింపావు నుంచి రోజు మొత్తం ఉంది.  సెప్టెంబరు 19  మంగళవారం రోజు చవితి తిథి 11 గంట్లలోపే వెళ్లిపోతోంది. అందుకే సోమవారం పండుగ చేసుకోవాలి. సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటాం అనుకున్నవారు మంగళవారం ఉదయం 11 గంటల లోపు పూజ చేసుకోగలిగితే చేసుకోవచ్చు...

  • సెప్టెంబరు 18 సోమవారం దుర్ముహూర్తం టైమింగ్స్ - మధ్యాహ్నం 12 .25   నుంచి 1.09 వరకూ.. తిరిగి మధ్యాహ్నం 2.46 నుంచి 3.35...

  • సెప్టెంబరు 18 సోమవారం వర్జ్యం సాయంత్రం 4.56 నుంచి 6.36 వరకూ

  • వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయాల్లో పూజ ప్రారంభించకూడదు...

  • సెప్టెంబరు 18 ఉదయం 10.15 నుంచి 12.20 మధ్యలో కానీ తిరిగి మధ్యాహ్నం 1.10 నుంచి 2.45 మధ్యలో కానీ పూజ ప్రారంభించుకోవచ్చు

  • మీరు పూజ ప్రారంభించిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్నా పర్వాలేదు...ప్రారంభసమయమే పరిగణలోకి తీసుకోవాలి.


Also Read: కారాగార బాధల నుంచి విముక్తి కలిగించే గణనాథుడి రూపం ఇదే!


ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలి



  • వినాయక విగ్రహాన్ని కొనుగోలుచేసేవారు తొండం ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి

  • రసాయనాల్లో ముంచితీసిన వినాయకుడిని కాకుండా మట్టి విగ్రహం వినియోగించడం మంచిది

  • పార్వతీ తనయుడు నైవేద్య ప్రియుడు..అందుకే మండపాల్లో ఉండే స్వామివారికి నిత్యం నైవేద్యం సమర్పించినట్టే ఇంట్లో మీరు ఎన్నిరోజులు ఉంచితే అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వినాయకుడికి ఇష్టమైన వంటకాలైన కుడుములు, మోదకం, లడ్డు సహా పలు పిండివంటలు నైవేద్యం పెట్టాలి

  • విగ్రహ నిమజ్జనం కోసం కచ్చితంగా నదులు, సముద్రాల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. నదిలో కలిసే పిల్లకాలువలో నిమజ్జనం చేయొచ్చు

  • శుభ్రంచేసిన బకెట్లో నింపిన నీళ్లలో కూడా  వినాయకుడిని నిమజ్జం చేసి ఆ నీటిని చెట్లకు పోయాలి. 


Also Read: మీ స్నేహితులు, సన్నిహితులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కట్టాలి



  • ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.

  • గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ! ప్రకృతిలో సృష్టి , స్థితి , లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను , జీవాన్ని సూచించేందుకు పత్రినీ , ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తారు

  • గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవుడు. ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా ! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థం

  • పాలపుంతని సూచించే పాలవెల్లికి..నక్షత్రాలకు గుర్తుగా పళ్లు కడతారు. 

  • ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా ! అందుకే స్వామికి ఛత్రంగా పాలవెల్లి ఉంటుంది.

  • గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు ,పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం.

  • ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి , పైన పాలవెల్లిన కట్టి గరికతో పూజిస్తే చాలు...గణనాథుడు దిగొచ్చినట్టే...


పసుపు గణపతి పూజ లింక్ ఇది


గణపతి షోడసోపచార పూజ లింక్ ఇది


ఈ పూజ పూర్తైన తర్వాత  అక్షతలు, పూలు చేత్తో పట్టుకుని వినాయకుడి కథలు చదువుకోవాలి...ఆ లింక్ ఇదే