భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌పై లంకేయులకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత్ విజయానికి కేవలం 51 పరుగులు చేస్తే సరిపోతుంది.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (17: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), దుషాన్ హేమంత (13 నాటౌట్: 15 బంతుల్లో, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. మొత్తం 10 వికెట్లనూ పేసర్లే తీసుకున్నారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యాకు మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి.
కుప్పకూల్చిన సిరాజ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారి నిర్ణయం తప్పని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. మొదటి ఓవర్లోనే కుశాల్ పెరీరా (0: 2 బంతుల్లో) వికెట్ పడగొట్టి బుమ్రా భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక (2: 4 బంతుల్లో) బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ (0: 2 బంతుల్లో) రెండో బంతిని డాట్ బాల్‌గా ఆడాడు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక (0: 1 బంతి) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) బౌండరీకి తరలించాడు. చివరి బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ధనంజయ అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక కేవలం 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
అంతటితో ఆగకుండా తర్వాత ఓవర్లో కెప్టెన్ దసున్ షనకను (0: 4 బంతుల్లో) కూడా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కుశాల్ మెండిస్ (17: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), దనుత్ వెల్లలాగే (8: 21 బంతుల్లో) ఆరో వికెట్‌కు 21 పరుగులు జోడించారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. కానీ మహ్మద్ సిరాజ్ మళ్లీ లంకను దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కుశాల్ మెండిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం చివరి మూడు వికెట్లను హార్దిక్ టకటకా తీసుకున్నాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా చూసుకున్నా ఇది శ్రీలంకకు రెండో అత్యల్ప స్కోరుగా నిలిచింది.
భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక తుదిజట్టు
పతుమ్ నిశ్శంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial