శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలలోని రాంబగీచా పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసులు కంట్రోల్ రూం వద్ద పోలీసులు అధికారులు, సిబ్బందితో ఎస్పీ పరమేశ్వర రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ పరమేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 18వ తారీఖు నుండి సెప్టెంబరు 26వ తారీఖు వరకూ జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
4 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నాంమని, భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తోపులాట జరుగకుండా సిబ్బందిని ఏర్పాటు చేసాంమని, గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శ్రీనివాస సేతును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారని, ఘాట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీ చేసి, పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక తిరుమలకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.
సీఎం బస ఇక్కడే
అనంతరం పెద్దశేష వాహనంను సీఎం వీక్షించిన తర్వాత పద్మావతి అతిధి గృహంలో బస చేస్తారని ఆయన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో పకడ్బందీగా బందోబస్త్ చేసాంమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, వాహనసేవల దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసుల సిబ్బందితో భద్రత కల్పిస్తున్నాంమని, గరుడ సేవ నాడు అదనంగా వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసాంమని, తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నందున మిగిలిన వారు తిరుపతిలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.
చిన్నారులకు జియో ట్యాగింగ్, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నిర్వహణ, వీఐపీలు, భక్తుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నాంమని, భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించాంమన్నారు. మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2 వేల సీసీ కెమెరాలతో తిరుమల మొత్తం నిఘా ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూంకి అనుసందానం చేసినట్లు చెప్పారు. దీని ద్వారా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేదుకోకుండా, దొంగతనాలు జరుగకుండా నిరొధించ వచ్చునన్నారు.
చిన్నారులను తీసుకురావద్దు
వీలైనంత వరకూ బ్రహ్మోత్సవాల సమయంలో చిన్నారులను, వయోవృద్దులను తీసుకుని తిరుమలకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నడక మార్గంలో వన్యమృగాల సంచారం నేపధ్యంలో హై అలెర్ట్ జోన్ ప్రాంతంలో మరికొంత మందితో భధ్రత కల్పించాంమని, గరుడ సేవ ముందు రోజు మధ్యాహ్నం నుండి తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతిని నిలిపి వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, భక్తులు సమన్వయం పాటించి స్వామి వారి దర్శనం, వాహన సేవలు దర్శించుకోవాలని తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డి తెలిపారు.