Ugadi Yearly Rasi Phalalu 2025: గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే కర్కాటక రాశివారికి ఈ ఏడాది కొంతవరకూ యోగకాలమే..
కర్కాటక రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి మహోన్నతంగా ఉంటుంది. ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు సమసిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల నుంచి బయటపడతారు. ఏ పనులు ప్రారంభించినా పూర్తిచేసేస్తారు. ఉన్నతాధికారులతో పరిచయాలుంటాయి. డబ్బు, చదువు, వ్యక్తిగత జీవితం అన్నింటా సంతోషమే. గత కొంతకాలంగా పడుతున్న బాధలనుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి. అనుకోని ధనం చేతికందుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునేవారికి తీర్పు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితులను అయినా అధిగమించగల ఆత్మస్థైర్యం ఉంటుంది.
ఉద్యోగులకు
కర్కాటక రాశి ఉద్యోగులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మహోన్నతకాలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడినబదిలీలు, గృహలాభాలు, కేంద్రరాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులు జూలై తర్వాత ఉద్యోగం సాధిస్తారు. పర్మినెంట్ కానివారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది.
మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
రాజకీయ నాయకులు
కర్కాటక రాశి రాజకీయ నాయకులకు గ్రహ సంచారం అనుకూలమే. అధిష్టానం నుంచి మన్ననలు పొందడమే కాదు..ఏదో ఒక పదవి తప్పనిసరిగా పొందుతారు. ప్రజాదరణ ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేస్తే తప్పనిసరిగా విజయం వరిస్తుంది.
కళారంగం వారికి
ఈ ఏడాది కళారంగంలో ఉండేవారికి యోగకాలమే. టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు, ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్తగా కళా రంగంలో అడుగుపెట్టే కర్కాటక రాశివారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వ్యాపారులకు
కర్కాటక రాశి వ్యాపారులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనకూలం. ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించేవారికి బావుంది. భాగస్వామ్య, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, రీటైల్ వ్యాపారులకు బాగా కలిసొస్తుంది.
వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
విద్యార్థులు
ఈ ఏడాది మీకు గురుబలం లేనందున విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎంత కష్టపడినా ఆశించిన మార్కులు పొందలేరు. ఏడాది ఆరంభం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. అయితే ప్రథమార్థంలోనే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు కాబట్టి మంచి ర్యాంకులు పొందలేరు. ద్వితీయార్థంలో ప్రయత్నాలు సఫలం అవుతాయి
వ్యవసాయదారులు
కర్కాటక రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది మొదటి పంటకన్నా రెండో పంట లాభిస్తుంది. కౌలుదార్లకు కలిసొస్తుంది. అప్పులు తీరుతాయి. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. చేపలు, రొయ్యల వ్యాపారం చేసేవారికి లాభాలొస్తాయి
స్త్రీలకు
కర్కాటక రాశి స్త్రీలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కలిసొస్తుంది. కొన్నాళ్లుగా పడుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఓర్పు సహనం మీ ఖ్యాతిని పెంచుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. గతంలో విడిపోయిన భార్య-భర్త కలుస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కోరుకున్న చోటుకి బదిలీ జరుగుతుంది.
ఓవరాల్ గా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి జూలై నుంచి మూడేళ్లపాటూ మంచి జరుగుతుంది.
మిథున రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.