Telangana News | హైదరాబాద్: మార్చి 19న తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ (Telangana Budget 2025)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.  ఈమేరకు అసెంబ్లీ స్పీకర్‌ (Assembly Speaker) గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 13న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. మార్చి 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.  మార్చి 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ జరగనుంది. మార్చి 22, 24, 25, 26 పద్దులపై, 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది.


గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు కామెంట్స్..
గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదని.. గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి ఏం తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని గవర్నర్ తో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం. అబద్దాలు ప్రచారం చేయడానికి గవర్నర్ ను వాడుకోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. జర్నలిస్టులను అరెస్టు చేయడం,న్యాల్కల్, అశోక్ నగర్ లో నిరుద్యోగులను,  లగచర్లలో రైతులను పోలీసులతో కొట్టించడమేనా మార్పు. 20 శాతం కమిషన్లు తీసుకోవడమేనా ఇంక్లూసివ్ డెవలప్మెంట్


తెలంగాణ సంస్కృతి అంటే ఇదేనా..


తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాజీవ్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. దీన్ని రాష్ట్ర సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా?. 34 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల సాగు దిశగా కేసీఆర్ తీసుకెళ్లారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పాలనతో సాధ్యమైంది. 41వేల కోట్ల రుణమాఫీ అన్నరు. 31 వేల కోట్లు చెప్పి, 20వేల కోట్లు అని ఇప్పుడు చెబుతున్నారు. రైతు భరోసా రూ.3 వేలు తగ్గించారు. పంటలకు బోనస్ అని సన్నాలకు పరిమితం చేశారు. 


మహాలక్ష్మిలో మొదటి హామీకే దిక్కు లేదు..


ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు సంక్షేమ కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏం చేస్తున్నాయి. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామి నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదు. ఆంధ్రా వాళ్లు కృష్ణా జలాలు దోచుకుపోతుంటే మౌనంగా ఉన్నారు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ 10 వేలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. ఏటా 2లక్షల ఉద్యోగాలని యువతను మోసం చేసారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బిల్లు అంటున్నారు. కానీ కులగణన తప్పుల తడక. ఎస్సీ వర్గీకరణ తరువాతే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తమని రేవంత్ రెడ్డి ప్రకటించిండు. కానీ అడుగు కూడా పడలేదు. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలు గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతున్నాయి. దావోస్ తో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని’ హరీష్ రావు డిమాండ్ చేశారు.