హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ పెద్ద మనిషిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశపడిన బీఆర్ఎస్ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు నిరాశ చెందారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, రైతులకు పంట బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన, నిరసన మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
బీసీ కులగణనపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ లో పెట్టారు. మూడేళ్ల తరువాత మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.
ఇంతకీ గవర్నర్ స్పీచ్ లో ఏమన్నారంటే..
దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి తెలంగాణలో అవుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులకు రూ. 500 పంట బోనస్ ఇస్తోందని, మహాలక్ష్మీ స్కీమ్ గేమ్ ఛేంజర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. పేదింటి వారికి రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్ జిష్ణదేవ్ వర్మ తెలిపారు.
కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డను నాశనం చేస్తున్నారు
అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగం కాదు, గాంధీభవన్ లో రాసే ప్రెస్ నోట్‌లా ఉంది. పెద్దాయన గవర్నర్ నోటి నుంచి ఎన్నో అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రంలో 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడం లాంటి బాధ్యతాయుత మాట ఒక్కటీ గవర్నర్ నోటి నుంచి రాలేదు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా 30, 35 శాతానికి మించి రుణమాఫీ జరగలేదు. రేవంత్ నియోజకవర్గం అయినా, మా నియోజకవర్గాలైనా ఓకే.. వెళ్లి లెక్కలు పరిశీలిద్దామని ఛాలెంజ్ చేస్తే ముందుకొచ్చే ధైర్యం చేయలేదు. తాగునీటి సంక్షోభం పెరిగినా, మేడిగడ్డను కేసీఆర్ మీద కక్షతో రిపేయిర్ చేపించకుండా ఎండేలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇస్తలేరని సెక్రటేరియట్ పై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, సర్పంచులను వేధించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి నోట్ల మూటలు పంపుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లలో 80 మంది వరకు పిల్లలు చనిపోతే ఎలాంటి చర్యలు చేపట్టని చేతకాని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం’ అని కేటీఆర్ మండిపడ్డారు.