హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. శాసనసభకు చేరుకున్న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలో చర్చించాల్సిన వ్యూహాలపై పార్టీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదివరకే మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.


గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్
కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇంతవరకు సమావేశాలలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ బండిని నడిపించారు. నేడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పెండింగ్ హామీల అమలు తీరుపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో పింఛన్ ఇంకా పెంచకపోవడం, విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విదుదలలో జాప్యంపై నిలదీయనున్నారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన దళితబంధు పథకం నిలిపివేయడంతో పాటు కూలీలకు రూ.15 వేలు అని హామీ ఇచ్చి 12 వేలకు కుదించడం, పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం లాంటి వాటిపై అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.    



తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్..
- బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవ్వనున్న అసెంబ్లీ
- ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం 
- 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు
- 15వ తేదిన ధన్యవాద తీర్మాణంపై చర్చ
- 16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు
- 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ
- 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ
-19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టనున్న ప్రభుత్వం
- మార్చి 20న అసెంబ్లీకి సెలవు
- 21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ
- 29 వరకు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు