Jio Signs Agreement With Starlink: ఎయిర్‌టెల్ తర్వాత, రిలయన్స్ జియో కూడా ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడం సహా మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించేందుకు స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌తో డీల్ కుదుర్చుకుంది. తద్వారా, భారతదేశంలోని తన కస్టమర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌లను జియో అందించగలదు. ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావలసివుంది.
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం సహా విశ్వసనీయ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించడానికి స్టార్‌లింక్‌తో చేతులు కలిపినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. జియోకు చెందిన విస్తృతమైన మొబైల్ నెట్‌వర్క్‌ను & స్టార్‌లింక్ ఉపగ్రహ సాంకేతికతను కలుపుతామని ఆ ప్రకటనలో తెలిపింది.
హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్‌ను భారతదేశానికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందంపై సంతకం చేసినట్లు మార్చి 11న భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఒక్క రోజు గ్యాప్‌తో, రిలయన్స్ జియో కూడా మార్చి 12న దాదాపు ఇదే ప్రకటన చేసింది.
జియో-స్టార్‌లింక్ ఒప్పందంతో ఏం జరుగుతుంది?
జియో & స్పేస్‌ఎక్స్ ఒప్పందం ప్రకారం, జియో ఆఫర్‌లను స్టార్‌లింక్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. స్పేస్‌ఎక్స్ అందించే ఆఫర్‌లను వినియోగదారులు, వ్యాపారాలకు జియో చేరవేస్తుంది. జియో రిటైల్ అవుట్‌లెట్‌లు & ఆన్‌లైన్ స్టోర్‌లలో స్టార్‌లింక్ ఉత్పత్తులు, పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని జియో ఏర్పాటు చేస్తుంది.
డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో మొదటి స్థానంలో ఉంది. స్టార్‌లింక్, ప్రముఖ లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్. ఈ రెండు బలాలను కలిపి ఉపయోగించుకోవాలని & భారతదేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించాలని రెండు కంపెనీలు ఆశిస్తున్నాయి.
ఈ ఒప్పందం వల్ల జియో కస్టమర్లకు ఏంటి ప్రయోజనం?
స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం వల్ల, "నమ్మకమైన ఇంటర్నెట్ భారతదేశ వ్యాప్తంగా అన్ని సంస్థలు, చిన్న & మధ్యతరహా వ్యాపారాలు, కమ్యూనిటీలకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది" అని తన ప్రకటనలో జియో వెల్లడించింది.
స్టార్‌లింక్ ద్వారా వచ్చే హై-స్పీడ్ ఇంటర్నెట్ జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ సేవలకు మెరుగులు అద్దుతుంది. అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో కూడా తక్కువ ధరలకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్‌లు అందించేందుకు వీలవుతుంది.
"ప్రతి భారతీయుడు, అతను దేశంలో ఎక్కడ నివసిస్తున్నా, తక్కువ ధరకు & హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను పొందుతాడు" - రిలయన్స్ జియో గ్రూప్ CEO మాథ్యూ ఊమెన్
స్టార్‌లింక్ నెట్‌వర్క్ అంటే ఏమిటి?
స్టార్‌లింక్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి & అతి పెద్ద ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్. ఇది వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ (Wi-Fi) ఇంటర్నెట్‌ను అందించడానికి భూమి దిగువ కక్ష్యను ఉపయోగిస్తుంది. ప్రజలు స్టార్‌లింక్ పరికరాల ద్వారా శాటిలైట్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాలింగ్ వంటివి ఉపయోగించుకుంటారు. ప్రపంచంలోనే పెద్ద ఆస్తిపరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్పేస్‌ఎక్స్, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, భారతదేశంలో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి టెలికాం అధికారుల నుంచి ఆమోదం రావలసివుంది.
స్పేస్‌ఎక్స్‌తో భారతి ఎయిర్‌టెల్ ఒప్పందం
స్టార్‌లింక్‌తో ఒప్పందంపై సంతకం చేసినట్లు ఎయిర్‌టెల్ మార్చి 11న BSE ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపారులు, కమ్యూనిటీలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.