తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరవ సభలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తన సతీమణిని రాజకీయాల కోసం ఉపయోగించుకుటున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజా గౌరవ సభల పేరుతో మా అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరని వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
భువనేశ్వరి అక్క.. తనని అనరాని మాటలు అని, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతి ఇస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతామని తెలిపారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమని రాచమల్లు చెప్పుకొచ్చారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపిన ఘటనతో నేడు ప్రజా గౌరవ సభల అంశాన్ని పోల్చారు రాచమల్లు.
నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొదట వివాదాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేదికగా భువనేశ్వరికి పలుమార్లు క్షమాపణలు చెప్పారు. వివాదాన్ని ముగించాల్సింది చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం తాము ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ప్రజా గౌరవ సభలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు మహిళలను ఎలా కించ పరుస్తున్నారో ప్రత్యేకంగా వివరిస్తున్నారు.
వల్లభనేని వంశీ ప్రారంభించిన ఈ వివాదాన్ని అసెంబ్లీలో అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు కొనసాగించడంతో వివాదం ప్రారంభమయింది. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి