AP Political News :  ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో  పసిపాప మృతదేహంతో  120 కి.మీ దూరం ప్రయాణం చేశారు తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతుల చిన్నారి గురువారం విశాఖ కేజీహెచ్ మరణించింది. విశాఖ కేజీహెచ్ నుంచి  పాడేరు వరకు  120 కి.మీ దూరం స్కూటీపై  చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణం చేశారు. చిన్నారి మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరినా కేజీహెచ్ సిబ్బంది ఇవ్వలేదని,  బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక చేసేందేంలేక స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని 120 కి.మీ తీసుకెళ్లారు.         

  


ఈ ఘటన రాజకీయంగానూ కలకలం రేపింది ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందనే దానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. రోజుకో అమాన‌వీయ ఘ‌ట‌న‌, పూట‌కో ద‌య‌నీయ దృశ్యం మీ ద‌రిద్ర‌పాల‌న‌లో సర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. వైద్యానికి వెళితే నిర్ల‌క్ష్యం. చ‌నిపోయిన వారిని త‌ర‌లించేందుకు అంబులెన్సులు రావు. నిరుపేద‌లు చ‌నిపోతే అనాథ శవాల్లా ప‌డి వుండ‌డ‌మేనా? అని టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.                                    





గతంలో తిరుపతి, నేడు విశాఖలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు. సిబ్బంది, ప్రభుత్వంనిర్లక్ష్యం కారణంగా వరుస సంఘటనలు. కేజీహెచ్ ఆసుపత్రి నుండి 120 కిలోమీటర్లు స్కూటీ పై అల్లూరి జిల్లా కుమడ ప్రాంతానికి తల్లిదండ్రులు తమ బిడ్డ మృతదేహంతో ప్రయాణం చేయాల్సి రావడం అత్యంత బాధాకరమైన విషయమని అంబులెన్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 



జనసేన పార్టీ అధినేత పవన్ కూడా కూడా     ఈ ఘటనపై స్పందించారు.  బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 





ఇటీవలి కాలంలో వరుసగా ఇలా మృతదేహాలను తీసుకెళ్లడానికి అంబులెన్స్ లు దొరకక.. ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మీడియా దృష్టిలో పడిన తర్వాత ఎవరో ఒకరు స్పందించి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా  ఆస్పత్రుల్లో చనిపోతే  మృతేహాలను ఉచితంగా ఇంటి దగ్గర దగబెట్టే అంబులెన్స్‌లు ఉంటాయి. కానీ అవి పేదలకు అందుబాటులో ఉండటం లేదు.                 


కనికరించని అంబులెన్స్ సిబ్బంది, 120 కిలోమీటర్లు స్కూటీపై బిడ్డ మృతదేహం తీసుకెళ్లిన తల్లిదండ్రులు