Visakha News : ఆంధ్రప్రదేశ్ లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చంటిబిడ్డ మరణించింది. చంటి బిడ్డ మృతదేహం తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్కూటీపై 120 కిలోమీటర్లు ప్రయాణించి పాడేరుకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు.   అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయపడినా కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదని బాధితులు వాపోయారు.  గత్యంతరం లేక స్కూటీపై పాడేరుకి తీసుకెళ్లామని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. 


అసలేం జరిగింది? 


ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో  పసిపాప మృతదేహంతో  120 కి.మీ దూరం ప్రయాణం చేశారు తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతుల చిన్నారి గురువారం విశాఖ కేజీహెచ్ మరణించింది. విశాఖ కేజీహెచ్ నుంచి  పాడేరు వరకు  120 కి.మీ దూరం స్కూటీపై  చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు ప్రయాణం చేశారు. చిన్నారి మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరినా కేజీహెచ్ సిబ్బంది ఇవ్వలేదని,  బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక చేసేందేంలేక స్కూటీపై చిన్నారి మృతదేహాన్ని 120 కి.మీ తీసుకెళ్లినట్టుగా బాధితులు తెలిపారు. స్కూటీపై మృత శిశువును తీసుకెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న  వైద్య సిబ్బంది అప్పుడు స్పందించి పాడేరుకు  అంబులెన్స్ ను పంపించారు. పాడేరు నుంచి అంబులెన్స్ లో  చిన్నారి మృతదేహాన్ని  కుమడ గ్రామానికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా  కారణంగానే  తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 


చిన్నారి మృతికి కారణాలు చెప్పాలని డిమాండ్ 


ఫిబ్రవరి  2న విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో  నెలల చిన్నారిని జాయిన్ చేశారు కుమడ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు. అయితే రోజూ చిన్నారి నుంచి  రక్త నమూనాలు సేకరించేవారని, కానీ ఏం జరిగిందో ఆసుపత్రి  సిబ్బంది చెప్పలేదన్నారని వాపోయారు. గురువారం ఉదయం చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం తమ స్వగ్రామానికి  చిన్నారి  మృతదేహన్ని తరలించేందుకు ఐటీడీఏ అధికారుల వద్దకు వెళ్లినా  అంబులెన్స్ లేదని చెప్పారని బాధితులు తెలిపారు. చిన్నారి మృతికి కారణాలు చెప్పాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గత్యంతరం లేని పక్షంలో చిన్నారి మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్లామని చెప్పారు.  


మా నిర్లక్ష్యం లేదంటున్న కేజీహెచ్ వైద్యులు 


 బైక్ పై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై విశాఖ కేజీహెచ్ వైద్యులు వివరణ ఇచ్చారు. పాడేరు చెందిన దంపతులు చిన్నారి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడానికి సుమారు అరగంట సమయం పట్టిందన్నారు. గురువారం ఉదయం గం.7.50 లకు శిశువు చనిపోతే గం.8.30లకు తల్లిదండ్రులకు అప్పగించారు. వెంటనే గం.8.40లకు ఆసుపత్రిలోని ట్రైబల్‌ సెల్‌ వారికి కాల్‌ చేసి విషయం తెలియజేశామన్నారు. వారికి గం.9.15 లకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశామని,  ఈ లోపల గం.8.57లకు తల్లిదండ్రులు వినకుండా శిశువు మృతదేహాంతో ఆసుపత్రి నుంచి బయలుదేరిపోయారన్నారు. అయినప్పటికీ పాడేరులోని అధికారులకు  విషయం తెలియజేసి, వైద్య సిబ్బందితో వారి ఆచూకీ కనుక్కొని అక్కడకు అంబులెన్స్ పంపామన్నారు. పాడేరు నుంచి వారి స్వగ్రామం కుమడకు అంబులెన్స్ లో వారిని పంపించామన్నారు. ఈ సంఘటన పూర్తిగా దురదృష్టకరమని, ఇందులో కేజీహెచ్ తరఫున ఎటువంటి నిర్లక్ష్యం లేదన్నారు. గిరిజన దంపతులకు అవగాహన లేకపోవటం వల్ల అంబులెన్స్‌ వచ్చే 15 నిమిషాల ముందే స్కూటీపై చిన్నారి మృతదేహం తీసుకెళ్లారని వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.