ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఉత్తమ మార్గం. మానసిక ప్రశాంతత ఇవ్వడంతో పాటు చురుకుగా ఉండేందుకు సహకరిస్తుంది. మిమ్మల్ని శక్తివంతంగా, బలంగా మార్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే తప్పనిసరిగా క్రమం తప్పకుండా యోగా చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కదా అని అతిగా చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అతి అనర్థమే అవుతుంది. అది యోగా విషయంలో కూడా పాటించాలి. అతిగా యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. మితంగా చేస్తే సురక్షితంగానే ఉంటుంది. యోగాలో వివిధ రకాల ఆసనాలు శరీరాన్ని భౌతికంగా దెబ్బతీస్తాయని  అంటున్నారు.


యోగా ఎక్కువగా చేస్తున్నారా?


అనారోగ్యకరమైన రీతిలో యోగాను అభ్యసిస్తున్నారని తెలిపేందుకు శరీరం కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని గుర్తించగలిగి యోగా చేయడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనారోగ్యంపాలవక తప్పదు. ఫిట్ గా ఉండటం కోసం ఎక్కువ శ్రమ తీసుకుని ఆసనాలు వేస్తారు. దాని వల్ల ఎప్పుడు అలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు అతిగా యోగా చేస్తున్నారని అర్థం.


శారీరకంగా మీరు కఠినమైన ఆసనాలు వేస్తూ ఉంటే ఈ సమస్య ఎదుర్కోక తప్పదు. విశ్రాంతి లేకుండా వరుసగా చాలా రోజులు శరీరాన్ని కష్టపెట్టకూడదు. అందుకే శరీరానికి కనీసం ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని యోగా అభ్యాసకులు సూచిస్తున్నారు. శరీరాన్ని అతిగా కష్టపెడితే అది తీవ్ర గాయాలు చేసే ప్రమాదానికి దారితీస్తుంది.


ప్రారంభంలోని కష్టమైన ఆసనాలు వేయడం


యోగాలో ఎటువంటి అనుభవం లేకుండా కఠినమైన ఆసనాలు వేయడం అసలు మంచిది కాదు. ఇది మీ శరీరాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. నిపుణులు సూచనల మేరకు కొంత కాలం పాటు చిన్న ఆసనాలు వేస్తూ ఉండాలి. దాన్ని కొనసాగిస్తూనే క్రమంగా తీవ్రమైన ఆసనాలు వేయాలి. యోగాసనాలు శ్వాసతో మిళితమై ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి


శ్వాసలో ఇబ్బంది


నిత్యం యోగా చేస్తున్నప్పటికీ మీరు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంటే ఏదో లోపం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. యోగాలోని కొన్ని ఆసనాలు శ్వాసను సమతుల్యం చేస్తాయి. అందుకే భంగిమలు సరిగా లేవని అర్థం చేసుకుని వాటిని మార్చుకోవడం మంచిది. మీ నిద్రకి ఆటంకం కలుగుతూ ఉన్నా చురుకుగా పనులు చేసుకోలేకపోయినా కూడా యోగా అతిగా చేస్తున్నారని గుర్తించాలి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. యోగా గురువుల చెప్పిన దాని ప్రకారం మైకం, వికారంగా అనిపిస్తే మీరు యోగా చేయడం తగ్గించాలి. గది ఉష్ణోగ్రత 90 నుంచి 105 డిగ్రీల మధ్య ఉన్న గదుల్లో చేసే హాట్ యోగా అతిగా చేయడం వల్ల మైకం, వికారం, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.


ఆరోగ్యకరమైన పద్ధతిలో యోగా ఇలా చేయండి


ప్రశాంతమైన మనసు, శరీరం కోసం యోగా చేస్తారు. అందుకే యోగా చేసేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. యోగా అభ్యాసకులు చెప్పేది తప్పకుండా వినాలి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే వెంటనే చేయడం ఆపేయాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నిరంతరం చేయకుండా ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బేసిక్స్ పూర్తిగా నేర్చుకోవాలి. మస్క్యులోస్కెలెటల్ కారణాల కోసం యోగాను చేస్తున్నట్లయితే నిపుణుల సూచనల మేరకే చేయాలి. సొంతంగా ఆసనాలు వేయడం వాటిని సవరించడం చేయకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి