బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చాలా రోజుల నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ నడుస్తోంది. ఇదిగా రాజీనామా చేస్తున్నారు. అదిగో రాజీనామా చేస్తున్నారు అని ఇన్నాళ్లూ నడిచింది. చివరకు ఇవాళ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తనకు దిల్లీ నాయకత్వంపై నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. కొన్ని రోజుల నుంచి రాష్ట్ర నాయకత్వ లోపాలను ఎత్తి చూపుతూ హెడ్‌లైన్స్‌లో నిల్చుకున్నారు. అయినా రాష్ట్ర నాయకత్వం తన మాటకు విలువ ఇచ్చి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదన్నారు.
తనకు విలువ లేని చోట ఎక్కువ రోజులు ఉండలేనంటూ బాంబు పేల్చారు. కొన్ని వారాల నుంచి పార్టీ మారడంపై ఊగిసలాట కొనసాగిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. పార్టీ మార్పు అంశంపై ఇప్పటికే పలు దఫాలుగా అనుచరులతో చర్చించారు. వారం పది రోజుల క్రితం ఇది రాజీనామాలు అంటూ తన అనచురులు ఆయనకు చెప్పారు కానీ.. పరిస్థితులు చక్కబడతాయని అభిమానులను వారించారు. అదే టైంలో బీజేపీ అధినాయకత్వం నుంచి వచ్చిన ముఖ్యులు ఆయనతో సమావేశమై చర్చించారు.
ఈ మధ్యే పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శివప్రకాష్‌తో కన్నా లక్ష్మీనారాయణ సమావేశం అయ్యారు. రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాలు... రాష్ట్రంలో ఉన్న సమస్యలను వెల్లడించారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిందా సమావేశం. ఏకాంతంగా వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్ చర్చ కూడా నడిచింది. ఆ భేటీ జరిగిన ఇరవై రోజుల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అధ్యక్షుడు సోమువీర్రాజు, జీవీఎల్ వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ నడుస్తోంది. కన్నా వర్గాన్ని పూర్తిగా పట్టించుకోకుండా సోమువీర్రాజు, జీవీఎల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీకి పనికి వచ్చే కార్యక్రమాలు తీసుకోవడం లేదన్నారు. వీటికి సపోర్టివ్‌గా ఈ మధ్య కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ కూడా కాక రేపాయి.
నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని టార్గెట్ చేసుకొని సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడటంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అదే టైంలో ఇతర పార్టీల నేతలతో కన్నా లక్ష్మీనారాయణ వరుసగా భేటీ కావడంతో ఆయన పార్టీ మారుతున్నారనే పుకార్లు కూడా షికారు చేశాయి. ఈ మధ్య ఆయన అనుచరులు కూడా కొందరు రాజీనామా చేశారు. దీంతో కన్నా పార్టీ మార్పు ఖాయం అనుకున్నారంతా. కానీ ఇంతలో అధిష్ఠానం నుంచి వచ్చిన దూత కన్నాతో సమావేశం కావడం స్టోరీలో ట్విస్ట్‌లానే చెప్పవచ్చు.
ఈ మధ్యే జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డారు. కాపు సంఘాలతో జీవీఎల్ నరసింహారావు సన్మానాలు చేయించుకుంటున్నారని.. కాపులకు ఆయనేం చేశారని ప్రశ్నించారు. గతంలోనూ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై కన్నా లక్ష్మినారాయణ విమర్శలు చేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు. పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్ల అంశంపై జీవీఎల్ ఓ ప్రశ్న వేశారని ఈ సన్మానం చేశారు. ఇది కన్నా లక్ష్మినారాయణకు కోపం తెప్పించిందని చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని.. ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. చంద్రబాబు ఈ రిజర్వేషన్లను పూర్తి చేశారన్నారు. జనసేన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ .. తన నిర్ణయాలను తాను తీసుకోనివ్వాలని ఇతరులు ప్రభావితం చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారని స్పష్టం చేశారు.