చర్మంపై ఎర్రటి దద్దుర్లులా వచ్చి, దురద పెట్టడం కొంతసేపటికి పోవడం చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కానీ కొందరిలో ఈ సమస్య వస్తే కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఉంది. దీన్నే ‘అర్టికేరియా’ అంటారు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అక్యూట్ అర్టికేరియా, రెండోది క్రానిక్ అర్టికేరియా. ఎక్యూట్ అర్టికేరియా వస్తే దద్దుర్లు వచ్చి కొన్ని గంటల్లేనే పోతాయి. కానీ క్రానిక్ అర్టికేరియా వస్తే మాత్రం నెల నుంచి ఆరునెలల దాకా కొనసాగే అవకాశం ఉంది. మరీ తీవ్రంగా మారితే ఏడాది దాటాక కూడా ఉండొచ్చు. వీటికి మందులు రోజూ వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎర్రటి దద్దుర్లు చాలా దురదని పెడతాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం, రాత్రి తీవ్రంగా వేధిస్తాయి. అరుదుగా కొంతమంది ఈ అర్టికేరియాతో ఏళ్ల తరబడి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి.


ఎందుకు వస్తాయి?
మందులు, ఆహారపదార్థాలు శరీరంలోకి చేరాక అవి మనకి పడకపోతే రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఆ స్పందన చర్మంపై ఇలా ఎర్రటి దద్దుర్ల రూపంలో కనిపిస్తుంది. ఉదాహరణకి కోడిగుడ్లు తిన్న వెంటనే కొందరికి ఇలా కనిపిస్తుంది. అంటే వారికి గుడ్లు పడటం లేదని అర్థం. వేరుశెనగ పలుకులు, పుట్టగొడుగులు, రొయ్యలు వంటివి పడని వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. కొన్ని రకాల మందులు కూడా ఇలాంటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి వాపు ఉన్న వారిలో, ఆస్తమా, తరచూ జలుబు చేయడం వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ అర్టికేరియా బారిన త్వరగా పడతారు. ఈ ఎర్రటి దద్దుర్ల వల్ల కనీసం 6 నెలలు మందులు వాడాల్సి కూడా రావచ్చు. కొంతమంది దద్దుర్లు కాస్త తగ్గగానే సమస్య పోయిందనుకుని, మందులు వాడడం ఆపేస్తారు. దానివల్ల తిరిగి అర్టికేరియా వస్తుంది. కాబట్టి డాక్టర్ చెప్పినంత కాలం ఆపకుండా మందులు వాడాల్సిన అవసరం ఉంది. కొంతమందికి క్రానిక్ అర్టికేరియా ఉన్నవారిలో ఆరు నెలలు దాటినా దద్దుర్లు తగ్గవు. వచ్చి పోతూ ఉంటాయి. వారు ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు మందులు వాడాలి. అప్పటికి తగ్గకపోతే ఐదారేళ్ళు మందులు వాడాల్సి రావచ్చు.


టెస్టుల ద్వారా ఎలాంటి ఆహారాలు వారికి పడడం తెలుసుకోవడం కోసం లేదో రక్త పరీక్షలు చేయిస్తారు. అందులో అన్ని రకాల ఆహారాలతోనూ రక్తాన్ని పరీక్షిస్తారు. ఏ ఆహారం అలెర్జీని కలిగిస్తుందో తెలుసుకుంటారు. ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టమని సూచిస్తారు. ఎక్కువ మంది దురద రాగానే గోళ్ళతో గోకేస్తారు. దీనివల్ల సమస్య పెరిగిపోతుంది. ఇలా అర్టికేరియా సమస్యతో బాధపడేవారు అధిక గాఢత కలిగిన సబ్బులను ఎక్కువ వాడకూడదు. ఒత్తిడికి దూరంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి. 


Also read: మయోన్నెస్ రోజూ తింటున్నారా? ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.