ICC Rankings Trolled:  టీమిండియా బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో ప్రపంచ నెంబర్ 1 గా నిలిచిన జట్టుగా అవతరించింది. అయితే ఇదంతా ఐసీసీ తప్పిదం వలన జరిగింది. అసలేం జరిగిందంటే..


నిన్న ఐసీసీ.. జట్టు, ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో టెస్టుల్లో టీమిండియాను నెంబర్ 1 స్థానంలో నిలిపింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. దీంతో టెస్టుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి టీమిండియా అగ్రస్థానంలో నిలిచినట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు లిస్టును మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఐసీసీ తన అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. అయితే తన తప్పిదాన్ని తెలుసుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో దాన్ని సరిచేసింది. దీంతో ఆసీస్ మళ్లీ నెంబర్ 1 పొజిషన్ కు చేరుకుంది. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 


భారత ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకులు



  • ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాణించిన అశ్విన్ టెస్ట్ బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నెంబర్ 1 ర్యాంకులో ఉన్న ప్యాట్ కమిన్స్ కన్నా అశ్విన్ కేవలం 21 రేటింగ్ పాయింట్లు వెనకబడ్డాడు. 

  • పునరాగమనంలో అదరగొట్టిన రవీంద్ర జడేజా టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  

  • ఆసీస్ తో తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ర్యాంకింగ్స్ లో 10వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకాడు. 

  • భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో 6 స్థానాలు మెరుగై ఏడో ర్యాంకులో నిలిచాడు. 

  • ఇక ప్రస్తుతం మ్యాచ్ లు ఆడనప్పటికీ తమ తమ విభాగాల్లో రిషభ్ పంత్ 7వ ర్యాంక్, బుమ్రా 5వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. 

  • వన్డేల్లో శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్- 10లో ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ ప్రపంచ నెంబర్ 1గా కొనసాగుతున్నాడు. 






ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గిల్


ఇక టీమిండియా నయా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ 2023 జనవరి నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా ఎంపికయ్యాడు. ఇటీవల అద్భుత ఫాంలో ఉన్న గిల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. వన్డేలు, టీ20ల్లో శతకాలతో చెలరేగాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుల్లో కలిపి మొత్తం 567 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు ఉన్నాయి. 


గతేడాది వన్డేల్లో గిల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో తన తొలి టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ తో గిల్ పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్ లో అనుకున్నంతగా రాణించలేదు. వన్డేల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 3 ఇన్నింగ్సుల్లో 207 పరుగులు చేశాడు. తొలి, మూడో వన్డేల్లో వరుసగా 70, 116 పరుగులు సాధించాడు.