తెలంగాణ లో పెరుగుతున్న చలి తీవ్రత


తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండురోజుల పాటు చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది.. ఉదయం చలి పులి దాడి చేస్తుంటే.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదే వాతావరణం మరో వారం కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఇదే పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ఉంటుందని వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఇక ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటోంది.


నేటి నుంచి ఈ నెల 21వరకు కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు


కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి సన్నిధిలో  నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కీసరగుట్ట జాతరకు సీఎం కేసీఆర్‌ రూ.1కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈనెల 16 తేదీ నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య నేతృత్వంలో జిల్లా యాంత్రాంగం, దేవాదాయశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భక్తులు సులువుగా స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.


మల్లన్నసాగర్‌కు నేడు పంజాబ్‌ సీఎం


సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌తోపాటు తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నేడు పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్‌ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను సందర్శించనున్నారు. పంజాబ్‌ సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 11 గంటలకు ప్రాజెక్టుకు చేరుకుంటారు. 11 నుంచి 11.30 వరకు కొండపోచమ్మ సాగర్‌ను, పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11.40 గంటలకు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్‌డ్యామ్‌కు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గజ్వేల్‌ పట్టణంలోని పాండవుల చెరువుకు చేరుకొని మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.


 గ్రూప్‌-2 దరఖాస్తుకు నేడు లాస్ట్ డేట్


 గ్రూప్‌-2 దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో 783 ఉద్యోగాలకు గత డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అలాగే ఈనెల 23 వరకు గ్రూప్‌-3 దరఖాస్తు గడువు ఉంది.