Maha Shivratri 2023: మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని చెబుతారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి...రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. మహా శివరాత్రి ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18 శనివారం వచ్చింది. ఈ సందర్భంగా జీవిత చిత్రాన్ని ఆవిష్కరించే శివుడి పాటలు కొన్ని...


ఆటగదరా శివా 


జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి కనెక్టైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే.  
ఆటగదరా శివా ఆటగద కేశవా అని మొదలు పెట్టి, జనన మరణాలు, పంతం-అంతం, ప్రళయం-ప్రణయం, నలుపు-తెలుపు , మన్ను-మిన్ను లాంటి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచకు ఏసుదాసు స్వరం తోడైంది.



ఎట్టాగయ్యా శివా శివా


చావుకి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే.. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలోది 



భ్రమ అని తెలుసు


బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు..అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే సాంగ్  ఇది.. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోది



మాయేరా అంతా మాయేరా 


నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేస్తుంది



Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపూ


నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపూ..ఆ తర్వాత నువ్వు దేవుడివి-నేను అంటరానివాడిని , నీ కాలు కిందపెట్టకుండా ఉండేలా నిన్ను గర్భగుడికి చేర్చాను కానీ నీ గుడిలో నన్ను అడుగుపెట్టనివ్వవు, నీ ముందు వెలిగే దీపాల కోసం నేను చెమటడోచ్చాను కానీ మా కొడిగట్టిన బతుకులు మార్చవెందుకు అన్న ఓ శిల్పి ఆవేదన ఆవిష్కరించిన ఈ పాటకు రచన, సంగీతం, గానం అన్నీ చరణ్ అర్జున్...



Also Read: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!


జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వాళ్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు సర్వ స్వతంత్రులు. 
బ్రహ్మ-సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం.
విష్ణువు- సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. అందుకోసమే ఎన్నో అవతారాలెత్తాడు. 
మహేశ్వరుడు- లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. కానీ ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. 


వ్యామోహం లేనివాడే విరాగి. విరాగి మాత్రమే  సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివుడికి తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో తింటాడు, రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో ఉంటాడు. ఇంతటి విరాగి కనుకే ఆయన లయకారుడయ్యాడు. మనిషి ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా, చివరకు చేరేది ఆరడుగుల భూమిలోకే. ఎంత గొప్ప వ్యక్తి అయినా కాలాక మిగిలేది బూడిదే. ఈ వాస్తవాన్ని గ్రహించాలంటూ జీవిత చిత్రాన్ని తట్టిలేపే శివయ్య పాటలు ఇంకెన్నో ఉన్నాయి..వాటిలో కొన్ని మీకందించాం...