Jaggareddy On Komatireddy : బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల దిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు రాగానే తన వ్యాఖ్యలు వక్రీకరించారన్నారు. తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రేను జగ్గారెడ్డి గురువారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కోమటిరెడ్డి వ్యాఖ్యలు తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించాలని అన్నారు. ఆయన చెప్పింది ఒకటైతే, మీడియాలో మరొకటి ప్రచారం చేశారన్నారు. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 


మాణిక్ రావు థాక్రేతో జగ్గారెడ్డి భేటీ 


మర్యాదపూర్వకంగానే మాణిక్ రావు థాక్రేను కలిసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలిశానని చెప్పారు. ఈ భేటీలో తాజా రాజకీయాలపై చర్చించామన్నారు. బీఆర్ఎస్, బీజేపీని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. పార్టీలోని అంతర్గత విషయాలపై చర్చించలేదన్నారు. థాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతను థాక్రేకు వివరించానని చెప్పారు. సీనియర్లు పాదయాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో తన పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను తెలియజేస్తానన్నారు.  


కోమటిరెడ్డి వ్యాఖ్యల దుమారం


 వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుంది బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ తో కలవడం తప్ప మరో ఆప్షన్ లేదని ఇటీవల ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చే సరికి మాట మార్చారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని..  పొత్తుల అంశంపై తాను అన్న మాటు కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలనే తాను చెప్పానన్నారు. తానేం తప్పు చేయలేదని..తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేయవద్దని కోరారు. ఎవరికి ఎన్ని  సీట్లు వస్తాయన్న విషయాన్ని సోషల్ మీడియా సర్వేల ఆధారంగా చేసుకుని మాట్లాడానన్నారు. మీడియానే  తన మాటల్ని వక్రీకరించిందన్నారు. సెక్యూలర్ పార్టీతోనే పొత్తు అని చెప్పానని.. బీజేపీ ఈ విషయాన్ని రాజకీయం చేసిందన్నారు.  కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా  ఈ అంశంపై మాట్లాడుతున్నారని.. ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది మాత్రమే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ సీట్లపై వ్యాఖ్యలు తన వ్యక్దిగతమని కోమటిరెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. 


ఢిల్లీలో కోమటిరెడ్డి ఏమన్నారంటే ?


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావు.  అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం అవుతుంది.  అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా... ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది .  కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య .  ఇప్పుడిప్పుడే పార్టీ ఓ దారిలోకి వస్తోంది.   సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలి..  అలా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో నలభై నుంచి యాభై స్థానాలు గెలుచుకుంటుంది. ఏదైనా మిరాకిల్ జరిగేతే తప్ప కాంగ్రెస్‌కు అంతకు మించిన మెజార్టీ రాదు.