Kanna Into TDP : బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మినారాయణ తన భవిష్యత్ రాజకీయంపైనా ముందుగానే నిర్ణయించుకున్నారని అనుచరుు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు  ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ సారి మాత్రం ఆయన ఆ పార్టీతో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదని.. తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపారన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 24న కానీ.. ఆ తర్వాత కానీ ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. కన్నా అసెంబ్లీకి రావాలనుకుంటే సత్తెనపల్లి సీటు.. పార్లమెంట్‌కు వెళ్లాలనుకుంటే నర్సరావుపేట ఎంపీ సీటు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


సీనియర్ నేతగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపగల నేత కన్నా !


కన్నా లక్ష్మినారాయణకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. వంగవీటి రంగా అనుచరునిగా ఆయన రాజకీయం ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీలో పెదకూరుపాడు నుంచి వరుసగా విజయాలు సాధించారు. రాష్ట్రంలో టీడీపీ గెలిచినా.., కాంగ్రెస్ గెలిచినా  ఆయన విజయానికి ఢోకా ఉండేది కాదు. అక్కడ ఒక్క సారి కూడా ఓడిపోలేదు. మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పని చేశారు. వైఎస్ హయాంలో ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓ సారి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో మరోసారి నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో నర్సరాపుపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా డిపాజిట్ దక్కలేదు. అయితే ఆయనకుజిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉంది. కాపు సామాజికవర్గంలో పట్టు ఉంది. ఈ కారణంగా ఆయన రాక టీడీపీకి అడ్వాంటేజ్  అవుతుందని అంచనా వేస్తున్నారు. 


జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం - నాదెండ్ల మనోహర్ భేటీ !


బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఆయన  బీజేపీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో ఆయన పవన్ కల్యాణ్‌ విషయంలో సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో  నాదెండ్ల మనోహర్ కూడా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ సందర్భంగా జనసేనలో చేరికపై చర్చలు జరిగాయని చెప్పుకున్నారు. కానీ తర్వాత  జరిగిన రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరిగాయో కానీ ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాపులకు మేలు చేసిన వారు చంద్రబాబేనని.. రిజర్వేషన్లు ఇచ్చారని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లుగా తేలింది. 


కన్నా చేరితే టీడీపీకి డబుల్ అడ్వాంటేజ్ !


కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరితో గుంటూరులో గెలుపోటములు నిర్దేశించగలిగే ఓ బలమైన వర్గం అండగా నిలుస్తుందని.. అది ఏకపక్ష ఫలితాలను ఇస్తుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ సామాజికవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు లేరు. కన్నా కీలకంగా ఉండటంతో పాటు .. జనసేనతో కూడా  పొత్తు ఉండే అవకాశాలు ఉన్నందున.. ఇవన్నీ అడ్వాంటేజ్‌గా మారుతాయని అంచనా వేస్తున్నారు. కన్నా ఇంకా ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఆయన ప్రకటన తర్వాత రాజకీయ పరిణామాలపై ఓ స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.