ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల వర్షాలకు చాలా గ్రామాల్లో రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. ఓ గ్రామంలో దెబ్బతిన్న రోడ్డు కుమారుడి పెళ్లికి అవాంతరంగా మారింది. దీంతో ఆయన ఏకంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయించి... కుమారుడి పెళ్లికి బహుమతిగా ఊరి వాళ్లకు అందించాడు. రెండేళ్లుగా గోతులతో తీవ్ర అధ్వానంగా మారిన రహదారి కారణంగా కుమారుడి పెళ్లి వేడుకకు వచ్చేవారు ఇబ్బంది పడతారని భావించిన ఓ వ్యక్తి రూ. లక్షలు వెచ్చించి మరమ్మత్తులు చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసపురం నుంచి ఎలమంచిలి మండలం మేడపాడుకు వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారి సుమారు 15 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉంది. సగానికి పైగా రహదారిలో పెద్ద పెద్ద గోతులు పడి దారుణంగా తయారైంది.
Also Read: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
రూ. 2 లక్షలతో గుంతలు పూడ్చి
నరసాపురం మండలంలోని పలు గ్రామాల వారితో పాటు సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు నిత్యం ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. ఇదిలా ఉంటే కొత్త నవరసపురం గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణ రావు కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు వచ్చేవారికి ఇబ్బంది అవుతుందని భావించిన నిరీక్షణ రావు తన సొంత నిధులు రూ.రెండు లక్షలు వెచ్చించి కొత్త నవరసపురం గ్రామ పరిధి వరకు గోతులను పూడిపించి ఇబ్బందులు కొంతమేరకు తీర్చారు.
Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా
రోడ్ల పరిస్థితులు బాగోలేదు కానీ...
ఏపీలో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటే ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. మరమ్మత్తులు చేసేందుకు వర్క్ ఛార్జ్ సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చించకపోవడం, కాంట్రాక్టర్ల పెండింగు బిల్లులు చెల్లించకపోవడం అసలు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా రోడ్ల పరిస్థితులు బాగోలేదని చెబుతూనే గత ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తుంది. వర్షాకాలం ముగియగానే రోడ్లకు మరమ్మత్తులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.