ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ప్రజలు తిరగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా
ప్రజా వ్యతిరేకత కప్పిపుచ్చుకునేందుకు కుట్రలు
రాష్ట్ర చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిన ప్రభుత్వం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇలాంటి పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగైతే త్వరలోనే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. దొంగ ఓట్లు వేస్తారని ముందే చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను అపహాస్యం చేసిన ఘటనలు ఇవాళ చూస్తున్నామన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆరోపించారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను ఆదివారం రాత్రే టీడీపీ నేతలు పట్టుకున్నారన్నారు. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పైగా టీడీపీ నేతలను అరెస్టు చేశారన్నారు. పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే ప్రభుత్వాన్నే నిర్వహించుకోవాలని వెళ్లిపోవచ్చన్నారు. వైసీపీ ఎంపీలు, మేయర్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎందుకు ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు.
Also Read: కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !