తిరుపతి పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఏపీలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై సమాలోచనలు చేశారు. పార్టీ నేతలకు అమిత్ షా కీలక సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విరివిగా నిధులు ఇస్తోందని..  కేంద్ర నిధులతో ఏపీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేయాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ఏపీకి ఉదారంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సమయంలో ఆంధ్ర ప్రజలను కేంద్రం ఆదుకుందుని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 


Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !


బీజేపీ నేతలు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాల్లో స్పష్టంగా ప్రజలకు అభిప్రాయాలను చెప్పలేకపోతోందని ఈ విషయంలో స్పష్టత ఉంటే బాగుంటుందని అమిత్ షా దృష్టికి కొంత మంది నేతలు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని విషయంలో ఏపీ బీజేపీ తీర్మానం చేసిందని కానీ రైతులకు మద్దతుగా ఇచ్చే విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. మరికొన్ని విషయాల్లోనూ అదే పరిస్థితి ఉందని.. ఈ గందరగోళానికి తెర దించాలని షాను కొంత మంది నేతలు కోరినట్లుగా చెబుతున్నారు. 


Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా


కొంత మంది నేతలు ఏపీ ప్రభుత్వ నిర్బంధాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపైనా దాడులు చేశారని..  పలు చోట్ల బీజేపీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే జనసేనతో పొత్తు ఉన్నప్పటికి రాష్ట్ర స్థాయిలో సమన్వయం కుదరడం లేదని.. రెండు పార్టీలు వేర్వేరుగా కార్యాచరణ చేపట్టాయని.. అలా చేయడం వల్ల రెండు పార్టీల క్యాడర్ కలసి పని చేయడం లేదన్న అభిప్రాయం వస్తోందన్నారు.  పార్టీల నేతల అభిప్రాయాలన్నింటినీ అమిత్ షా జాగ్రత్తగా విన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read : ఎంపీ అవినాష్ రెడ్డికి ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వాలి... వివేకా డ్రైవర్ వాంగ్మూలంపై డీజీపీ స్పందించాలి... టీడీపీ నేతల కామెంట్స్


బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని కీలకమైన చర్యలను అమిత్ షా పార్టీ నేతలకు సూచించి అమలు చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశంలో పాల్గొన్న వారిలో పురందేశ్వరి, సత్యకుమార్, సోము వీర్రాడు, కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నారు. అమిత్ షా కొంత మందితో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. 


Also Read : కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి